రూ.40 లక్షల ఆఫర్.. బంధువుల ద్వారా ట్రాప్.. వంశీ ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు. బాధితుడు సత్యవర్థన్ చెప్పిన విషయాలతోపాటు నిందితుడు వంశీ హైదరాబాద్ నివాసంలో లభించిన ఆధారాలు ప్రకారం పోలీసులు ఈ కేసు దర్యాప్తులో చాలా పురోగతి సాధించారని అంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసును ఉపసంహరించుకుంటే బాధితుడు సత్యవర్థన్ కు రూ.40 లక్షలు ఇస్తామని ఆఫర్ చేయడంతోపాటు అడ్డాన్సుగా రూ.20 వేలు చెల్లించారని పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతోపాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉపసంహరించుకోవాలని వంశీతోపాటు ఆయన అనుచరులు తనకు డబ్బు ఆఫర్ చేశారని బాధితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసు విత్ డ్రా చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారని బాధితుడు ఆరోపించినట్లు సమాచారం. నిందితుల బెదిరింపులతో తాను కోర్టుకు వచ్చి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపాడు. బంధువుల ద్వారా హైదరాబాద్ నుంచి సత్యవర్థన్ ను పిలిపించిన వంశీ అనుచరులు బాధితుడితో మాట్లాడి.. ఆ తర్వాత వంశీ వద్దకు తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. మెజిస్ట్రేట్ వద్దకు వంశీ అనుచరుల కారుపైనే వచ్చిన బాధితుడు.. తిరిగి వారితోనే వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. అదేసమయంలో తమ సోదరుడు కనిపించడం లేదని, సత్యవర్థన్ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో మొత్తం డొంక కదిలినట్లు చెబుతున్నారు.
ఈ కిడ్నాప్ కేసులో మొత్తం ఆరుగురి హస్తం నేరుగా ఉందని చెబుతున్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోర్టులో లొంగిపోయేందుకు అతడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సత్యవర్థన్ ను బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేసిన వంశీ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకే అనుచరుల ద్వారా తన ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి పాత్ర ఏంటన్నది తెలియాలంటే.. వంశీ మొబైల్ ఫోన్ ప్రధాన ఆధారమని చెబుతున్నారు. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం కనిపించకపోవడంతో పోలీసులు సవాల్ ఎదుర్కొంటున్నారు.
వంశీ అరెస్టు సమయంలో ఫోన్ ఆయన వద్దే ఉండేదని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు నోటీసు అందుకున్నాక, బట్టలు మార్చుకుని వస్తానని చెప్పిన వంశీ సుమారు 40 నిమిషాలు తన గదిలోనే గడిపాడని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో కొందరు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులకు వంశీ ఫోన్ చేసి సమాచారం చేరవేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాతే ఫోన్ ఏం చేశారన్నది మిస్టరీగా మారింది. ఈ ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఎవరి పాత్ర ఏంటన్నది స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బాధితుడు సత్యవర్థన్ ను ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో తాను ఇచ్చిన స్టేట్ మెంటును ఉపసంహరించుకోవడంతోపాటు కిడ్నాప్ కేసుపైనా ఆయన వాంగ్మూలం నమోదు చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.