'కియా' కార్ల ఫ్యాక్టరీలో 900 ఇంజిన్లు మాయం.. లేటుగా బయటకు!
అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియా ఫ్యాక్టరీలో జరిగిన దొంగతనం సంచలనంగా మారింది.;

ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియా ఫ్యాక్టరీలో జరిగిన దొంగతనం సంచలనంగా మారింది. 900 కార్ల ఇంజిన్లను దొంగలించిన షాకింగ్ నిజం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి పంచాయితీ పరిధిలో కియా పరిశ్రమ ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడే కియాతో పాటు మరో 25 అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి.
కియా ప్రధాన ఫ్యాక్టరీలో రోజుకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలో మొత్తం 900 ఇంజిన్లు మయమైనన విషయాన్ని కంపెనీ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ గుట్టుచప్పుడుకాకుండా ఉన్నారే తప్పించి.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇదిలా ఉండగా మార్చిలో జిల్లా ఎస్పీ కియా పరిశ్రమను సందర్శించారు.
ఈ సందర్భంగా తమ ఫ్యాక్టరీలో 900 ఇంజిన్లు చోరీకి గురైన విషయాన్ని ఎస్సీకి చెప్పారు. కంప్లైంట్ ఇవ్వాలని చెప్పినా.. ఈ విషయం బయటకు రావటం ఇష్టం లేక మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కంప్లైంట్ చేస్తే కానీ కేసు కట్టే అవకాశం లేదని చెప్పటం ద్వారా.. కియా సీఈవో ఫిర్యాదు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అయితే.. ఈ సమాచారం బయటకు రాకుండా ఉంచాలని కోరినట్లుగా తెలుస్తోంది.
మార్చి 19న కియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ విచారణ కోసం సిట్ కూడా వేశారు. విచారణలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కియా పరిశ్రమకు ఇంజిన్లు దిగుమతి అవుతుంటాయి.వాటిని కంటైనర్ల ద్వారా ఫ్యాక్టరీకి తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలో దారి మధ్యలో ఇంజిన్లను కొట్టేస్తుంటారని అనుమానిస్తున్నారు. ఇదంతా గతంలో పని చేసిన మాజీ ఉద్యోగులు చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ చోరీ కేసు ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.