దేశాన్ని కుదిపేస్తున్న నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఏం జరిగింది? డిటైల్ స్టోరీ
ఫిబ్రవరి 16, 2025న ఒడిశా భువనేశ్వర్‌లోని కలింగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో ఓ విషాదకర సంఘటన జరిగింది.
ఫిబ్రవరి 16, 2025న ఒడిశా భువనేశ్వర్‌లోని కలింగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో ఓ విషాదకర సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన 20 ఏళ్ల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని ప్రకృతి లంసాల్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రకృతి నేపాల్‌లోని రూపందేహి జిల్లాలోని సిద్ధార్థనగర్‌కు చెందినవారు. ఆమెను సహ విద్యార్థి అయిన అద్విక్ శ్రీవాత్సవ తరచుగా వేధించేవాడని, నేరుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సమాచారం. అద్విక్, లక్నో (ఉత్తరప్రదేశ్) కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి. అతను ఆమె వ్యక్తిగత చిత్రాలను లీక్ చేస్తానంటూ బెదిరించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు కారణంగా ప్రకృతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని తెలుస్తోంది.
ప్రకృతి KIIT యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె సమస్యపై ఎటువంటి స్పష్టమైన చర్య తీసుకోలేదని సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 16న ఆమె హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించడంతో యూనివర్సిటీ అట్టుడికిపోయింది. విద్యార్థులంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసులు వెంటనే స్పందించారు.
- ఆందోళనలతో తీసుకున్న చర్యలు
ఈ ఘటన గురించి తెలియగానే KIIT లోని 500 మందికి పైగా నేపాలీ విద్యార్థులు విశ్వవిద్యాలయంపై నిరసన చేపట్టారు. వారి డిమాండ్ ప్రకారం KIIT యాజమాన్యం ప్రకృతి చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుంది. నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో క్యాంపస్ భద్రతా సిబ్బంది, విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో KIIT యాజమాన్యం వెంటనే నేపాలీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి యూనివర్సిటీని వీడాలని ఆదేశించింది. చాలా మంది నేపాలీ విద్యార్థులను రైల్వే స్టేషన్లలో వదిలేసినట్లు సమాచారం. ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేసింది.
- ప్రభుత్వంతో దౌత్య చర్యలు
ఈ సంఘటనపై నేపాల్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి స్వయంగా భారత ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. నేపాలీ విద్యార్థులపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా ప్రభుత్వం వెంటనే KIIT యాజమాన్యాన్ని నేపాలీ విద్యార్థులను తిరిగి హాస్టల్‌లోకి అనుమతించాలని ఆదేశించింది. అనంతరం KIIT యాజమాన్యం దీనికి సమాధానం ఇచ్చి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఒడిశా ప్రభుత్వం ప్రకృతి ఆత్మహత్యపై విచారణకు ముగ్గురు సభ్యుల ప్రత్యేక కమిటీని నియమించింది.
- పోలీసు దర్యాప్తు.. తదుపరి చర్యలు
ఘటన జరిగిన తర్వాత ప్రకృతి ఆత్మహత్యకు కారకుడైన అద్విక్ శ్రీవాత్సవను భువనేశ్వర్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద వేధింపు, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. KIIT విశ్వవిద్యాలయ యాజమాన్యం, డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులను విచారణ కమిటీ పిలిపించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కూడా KIIT యాజమాన్యం నుంచి వివరణ కోరింది.
-బాధితురాలి తండ్రి డిమాండ్ ఇదీ..
ఈ ఘటనపై మృతురాలి తండ్రి కాఠ్‌మాండూ నుంచి మీడియాతో మాట్లాడారు. “రామాయణ కాలం నుండి భారత్-నేపాల్ మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు నేను ఒడిశాలో ఉండటం సాధ్యం కాదు. కానీ, నా కుమార్తెకు భారత్ న్యాయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది,” అని ఆయన అన్నారు."తన సోదరుడి భవిష్యత్తును ఉన్నతంగా మార్చాలని తపించింది. కానీ, ఇలా అకస్మాత్తుగా మాకు దూరమైంది. ఆమె కలలన్నీ అర్థాంతరంగా ముగిశాయి. ఆమెను ఈ పరిస్థితికి నెట్టినవారికి శిక్ష తప్పకుండా పడాలి" అని మృతురాలి తండ్రి డిమాండ్ చేశారు. ఆమె సహజంగా ఎవరితోనూ త్వరగా కలిసిపోయే వ్యక్తి కాదు. అయినప్పటికీ, తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేసిందని తెలిపారు. అయితే, విశ్వవిద్యాలయ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. వేధింపులకు పాల్పడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే తన కుమార్తె ఈ దుస్థితిని ఎదుర్కొనాల్సిన అవసరం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.