యమ 'కిమ్'కరుడి ఆత్మాహుతి డ్రోన్.. కొరియాపైనా? ఉక్రెయిన్ పైనా?

అంతేగాక ఇప్పుడు ఏకంగా భారీ సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-11-15 07:23 GMT

ప్రపంచంలో ఇప్పటికే ఉన్న రెండు యుద్ధాలు చాలవన్నట్లు.. మరో ఉద్రిక్తతకు కాలు దువ్వుతున్నారు ఓ దేశాధినేత. పొరుగుతోనే తీవ్ర సంఘర్షణ ఉండగా మరో దేశంలోకి సైన్యాన్ని పంపారు. అంతేగాక ఇప్పుడు ఏకంగా భారీ సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలాంటి వీటిని ఎవరి మీద ప్రయోగిస్తారో..?

ఉలిక్కిపడేలా చేస్తూ..

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయడం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు మామూలే. అణు పరీక్షలు, అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి ప్రయోగాలను అలవోకగా చేసేస్తుంటారు. అలాంటి కిమ్‌.. ఉక్రెయిన్ కు తమ సైన్యాన్ని పంపారు. రష్యా సైన్యానికి మద్దతుగా ఈ పని చేశారు. ఇలాంటి సమయంలో భారీగా ఆత్మాహుతి డ్రోన్లు సిద్దం చేయాలంటూ ఆదేశాలివ్వడం గమనార్హం. తమ సైన్యం ఉక్రెయిన్ లో కాలుపెట్టేందుకు సిద్ధమైన సమయంలో కిమ్ ఇలాంటి ఆదేశాలు ఎందుకిచ్చారా? అనేది ఆందోళనకరంగా మారింది.

స్వయంగా పర్యవేక్షించి..

ఆదేశాలు ఇవ్వడమే కాక.. ఆత్మాహుతి డ్రోన్ల పరీక్షను కిమ్‌ నేరుగా పర్యవేక్షించారట. భూ ఉపరితలం, సముద్రంలోని లక్ష్యాలను ఈ డ్రోన్‌ ఛేదించింది. దీంతో మరుసటి రోజే ఆత్మాహుతి డ్రోన్లను భారీగా ఉత్పత్తి చేయాలని కిమ్ ఆదేశించారు. అంతేగాక వీలైనంత వేగంగా ఉత్పత్తి మొదలుపెట్టాలని కూడా గట్టిగా ఆదేశించారట. పైగా ఈ డ్రోన్లను అత్యంత తేలిగ్గా వినియోగించే శక్తిమంతమైన ఆయుధంగా కిమ్‌ అభివర్ణించారట.

ఆగస్టులో ఉత్తర కొరియా మొదటిసారి ఆత్మాహుతి డ్రోన్లను ప్రదర్శించింది. రష్యాతో స్నేహం ద్వారా సంపాదించిన టెక్నాలజీతో వీటిని ఉత్తర కొరియా తయారు చేసింది.కాగా, రెండేళ్ల కిందట కూడా కిమ్‌ సైన్యం చిన్నచిన్న డ్రోన్ల దండును దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించాయి. వీటిని కూల్చడం దక్షిణ కొరియాకు పెద్ద సవాల్ గా మారింది. చివరకు డ్రోన్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ ను ఏర్పాటు చేసుకుంది.

ఆదేశాలు ఎందుకోసం?

ఆత్మాహుతి డ్రోన్ల విషయమంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ తాజా ఆదేశాలు ఉక్రెయిన్ లో తమ సైన్యానికి ఉపయోగపడేందుకా? దక్షిణ కొరియాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మనసులో పెట్టుకుని ఇచ్చినవా? అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆగస్టులో డ్రోన్లను పరీక్షించింది ఉత్తర కొరియా. ఇజ్రాయెల్‌కు చెందిన హరోప్‌, హీరో-30, రష్యాలోని లాన్సెట్‌-3లను పోలి ఉన్నాయి ఈ డ్రోన్లు. ఇజ్రాయెల్‌ లో ఇరాన్‌ హ్యాకింగ్‌ కు పాల్పడి ఈ సాంకేతికతను దొంగిలించి రష్యాకు ఇచ్చిందని.. అక్కడినుంచి ఉత్తరకొరియాకు చేరాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News