ఉత్తర కొరియా చెత్త బెలూన్లతో తల పట్టుకుంటున్న సౌత్ కొరియా!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి చెప్పాల్సిన పనే లేదు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తరచూ అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో తన శత్రు దేశాలు.. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా, నోరెత్తితే కఠిన శిక్షలు విధించేలా కిమ్ ఉత్తర కొరియాను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.
ఉత్తర కొరియాపైన పాశ్చాత్య దేశాలు తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆ దేశాన్ని ధూర్త దేశంగా ప్రకటించినా కిమ్ లెక్కచేయడం లేదు. తరచూ తన వివాదాస్పద నిర్ణయాలతో కల్లోలపరుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసి ఈ ఆధునిక నియంత వార్తల్లో నిలిచాడు.
ఓవైపు అణ్వాయుధ పరీక్షలు, మరోవైపు క్షిపణి పరీక్షలతో పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కిమ్ ఇంకో విధంగానూ ఆ దేశాన్ని ఇక్కట్లపాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్తతో నిండిన బ్యాగులను కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలో విడిచిపెడుతోంది.
ఈ చెత్తతో కూడిన ఎయిర్ బెలూన్లలో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలు, మలవిసర్జన, మురుగు బురద ఉన్నాయని చెబుతున్నారు. గతంలో 2016లోనూ ఉత్తర కొరియా ఇలాంటి బెలూన్లనే దక్షిణ కొరియా గగనతలంలోకి విడిచిపెట్టింది. అప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మే నెల చివరి వారం నుంచి ఇలా చెత్తతో నిండిన బ్యాగులను కట్టిన 5500 బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదిలింది. ఈ చెత్త బెలూన్లు ఆ దేశంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.
ఏకంగా దక్షిణ కొరియాలో ప్రముఖ నగరమైన ఇచియాన్ లో విమానాశ్రయం రన్ వేను కూడా మూసివేయాల్సి వచ్చింది. ఈ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఐదో విమానాశ్రయం కావడం గమనార్హం.
చివరకు దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా చెత్త బెలూన్లు పడ్డాయి. ఈ ఏడాది జూన్ 26న కూడా ఇచియాన్ ఎయిర్ పోర్టు రన్ వేను అధికారులు కొన్ని గంటలపాటు ఈ చెత్త బెలూన్ల కారణంగా మూసివేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో తాజాగానూ మరోసారి ఇచియాన్ విమానాశ్రయం రన్ వేపై చెత్త బెలూన్లు పడ్డాయి.
కేవలం ఇచియాన్ విమానాశ్రయమే కాకుండా గింపో ఎయిర్ పోర్టు కూడా ఉత్తర కొరియా చెత్త బెలూన్ల బారినపడింది. ఆ బెలూన్లతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. అలాగే వాటిని దారి మళ్లించాల్సి వస్తోంది.. దీంతో విమాన ఇంధన వ్యయాలు తడిసి మోపిడవుతున్నాయి. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయి.
ఉత్తర కొరియా చెత్త బెలూన్లతో చివరకు దక్షిణ కొరియా రాజధాని సియోల్ విమానాశ్రయ రన్ వేను కూడా ఈ ఏడాది జూన్ నుంచి రెండుసార్లు కొద్ది గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది.