కిమ్ కు ఊహించని దేశం నుంచి సాయం ఆఫర్ ఏమిటీ మౌనం ?
ఈ భారీ వర్షాలకు నదులు పొంగి వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారని అంటున్నారు.
ఈ ప్రపంచంలోని దేశాధినేతల్లో "నా రూటే సెపరేటు.." అన్నట్లుగా ఉంటుంది కిమ్ వ్యవహారం అనేది తెలిసిన విషయమే. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా అడ్డూ అదుపూలేని నియంత పాలన కొనసాగిస్తున్నారు కిమ్! ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు కిమ్ రాజ్యంపై ప్రకృతి ప్రకోపించింది.. గతకొన్ని రోజుగా ఉతరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ భారీ వర్షాలకు నదులు పొంగి వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారని అంటున్నారు. దీంతో.. ఇటీవల వరదల్లో మోకాళ్లోతు నీటిలో తన లగ్జరీ కారులో కూర్చుని ప్రయాణించి, పరిశీలించిన కిమ్.. ఇప్పుడు వరద ప్రాంతల్లో బోటుపై తిరుగుతూ పరిస్థితిని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. ఈ సమయంలో కిమ్ కు ఊహించని రాజ్యం నుంచి మానవతాసాయం ఆఫర్ వచ్చింది.
అవును... ప్రస్తుతం భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తామని ఆఫర్ చేసింది దాయాదీ దేశం దక్షిణ కొరియా. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామాగ్రిని అందజేస్తామని ప్రకటించింది. ఇక వాటిని ఎలా అందిచాలనే విషయంపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తర కొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది.
అయితే దక్షిణ కొరియా ఆఫర్ పై కిమ్ స్పందించకపోవడం గమనార్హం. కాగా... ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయనేది తెలిసిన విషయమే. క్షిపణి ప్రయోగాల నుంచి చెత్త బెలూన్స్ వరకూ కిమ్ కవ్వింపులు.. దక్షిణ కొరియా యుద్ధ సన్నాహాలతో నిత్యం ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియా సాయానికి ముందుకు రావడం గమనార్హం!
మరోవైపు వరదల కారణంగా ఉత్తరకొరియాలో పలు ప్రాంతాలు నీట మునగడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ సమయంలో కిమ్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రెస్క్యూ సిబ్బందితో కలిసి బోటులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి!