జగన్ మీద నల్లేరులా దూసుకువస్తున్న నల్లారి !

కానీ పదకొండు నెలలకే రోశయ్యను పక్కన పెట్టించేలా నల్లారి వారు ఢిల్లీ స్థాయిలో వేసిన వ్యూహాలు పారడంతో పెద్దాయన మాజీ సీఎం అయ్యారు.

Update: 2024-08-15 03:51 GMT

వైసీపీ అధినేత జగన్ కి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య రాజకీయ యుద్ధం ఉమ్మడి ఏపీలో జరిగిన సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి పోవడానికి ఒక రకంగా నల్లారి కారణం అని చెబుతారు. రోశయ్య సీఎం గా ఉన్నా జగన్ ఎలాగోలా సర్దుకున్నారు. కానీ పదకొండు నెలలకే రోశయ్యను పక్కన పెట్టించేలా నల్లారి వారు ఢిల్లీ స్థాయిలో వేసిన వ్యూహాలు పారడంతో పెద్దాయన మాజీ సీఎం అయ్యారు. నల్లారి హ్యాపీగా సీఎం పీఠం అధిరోహించారు.

నల్లారి అలా మూడేళ్ళకు పైగా ఉమ్మడి ఏపీని ఏలిన సీఎం గా చివరి సీఎం గా చరిత్ర సృష్టించారు. అప్పట్లో నల్లారికి కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే జగన్ ని కట్టడి చేయడం. దాని కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అదే క్రమంలో చిత్తూరు జిల్లాలో బద్ధ శత్రువులుగా దశాబ్దాల నాటి నుంచి ఉన్న చంద్రబాబు నల్లారి కుటుంబాలు కూడా కలసి రాజకీయం చేశాయి. జగన్ మీదకు ఉమ్మడిగానే ఎత్తులు వేసి మరీ అరెస్ట్ దాకా కధను నడిపించాయి.

ఇక విభజన ఏపీలో నల్లారి పాత్ర ఏమీ లేదు. ఆయన కాంగ్రెస్ ని వీడి సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. 2014లో ఆ పార్టీ ఓటమితో ఆయన తెర మరుగు అయ్యారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 2019 తరువాత కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎనభై వేల ఓట్ల తేడాటో ఓటమి పాలు అయ్యారు.

ఓడిన రెండున్నర నెలల తరువాత నల్లారి వారు మళ్లీ జనంలోకి తాజాగా వచ్చారు. వస్తూనే ఆయన జగన్ ని గట్టిగా టార్గెట్ చేశారు అనంతపురం లో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో జగన్ మీద నల్లారి తీవ్ర విమర్శలే చేశారు. సొంత బాబాయ్ హత్య కేసునే పట్టించుకోని జగన్ ఏపీ ప్రజలను ఎందుకు పట్టించుకుంటారు అని ప్రశ్నించారు.

అయిదేళ్ల పాటు అరాచక పాలన సాగించిన జగన్ ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని అన్నారు. కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం శూన్యం అని ఇది దండగమారి వ్యవహారం అని జగన్ మీద ద్వజమెత్తారు. తానే కనుక సీఎం అయి ఉంటే పాత జిల్లాలనే ఏపీలో కొనసాగించేవాడిని అని ఆయన అన్న్నారు.

జగన్ నిర్ల్ర్లక్ష్య పూరితమైన పాలన వల్ల ఏపీ ప్రజలు పూఒర్తిగా నష్టపోయారు అని నల్లారి వారు ఘాటైన విమర్శలే చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎక్కడా తప్పించుకోలేరని వారికి తగిన శిక్ష పడుతుందని కూడా స్పష్టం చేశారు.

ఒక వైపు జగన్ని విమర్శిస్తూనే మరో వైపు చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించారు. బాబు సమర్ధుడైన నాయకుడు అని కితాబు ఇచ్చారు. బాబు పాలనలో పోలవరం పూర్తి అవుతుందని అలా ఆయన చరిత్రలో నిలిచిపోతారు అని అన్నారు. అమరావతి పోలవరం పూర్తి కావడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని కూడా నల్లారి కిరణ్ చెప్పారు.

పోలవరం పూర్తి అయితే రాయలసీమ జిల్లాల రైతాంగానికి కూడా ఎనలేని మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. అయిదేళ్ళ వైసీపీ పాలన ప్రజలకు ఒక షాక్ వంటిది అని కిరణ్ అభివర్ణించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతోనే ఏపీ మెల్లగా కోలుకుంటోదని ఏపీ అభివృద్ధి పధంలో పయనించడం ఖాయమని అన్నారు

ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి సడెన్ గా జనంలోకి రావడమే కాదు జగన్ ని టార్గెట్ చేయడం వెనక భారీ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు ఆయన ఎక్కడో హైదరాబాద్ లోనే ఉంటారు ఎపుడూ ఏపీకి రారు అని విమర్శలు ఉన్నాయి.

అలా కాకుండా జనంతో టచ్ లో ఉంటే కేంద్రంలో ఎటూ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాజ్యసభ ఎంపీ అయినా లేదా గవర్నర్ పదవి అయినా దక్కవచ్చు అన్న ఆలోచనలతోనే ఆయన ఏపీతో కొత్త కనెక్షన్ పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుని పొగడటం కూడా ఆయన వ్యూహంలో కొత్తదనం అని అంటున్నారు. జగన్ వర్సెస్ కిరణ్ అన్నది రానున్న రోజులల్లో చూడబోతామా అన్నది కూడా ఆయన మాటలను చూస్తే అర్ధం అవుతోంది.

Tags:    

Similar News