సినిమా పేర్లు తెలుగులోనే ఉండాలి.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మహాసభల్లో రెండో రోజైన శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2025-01-04 09:19 GMT

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించారు. తెలుగు ప్రముఖులు, సినిమా ప్రముఖులు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మహాసభల్లో రెండో రోజైన శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

మహాసభలో భాగంగా కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగువారందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష అని, ఈ భాష గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా తేటతేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా అని పాడుదామని పిలుపునిచ్చారు. తెలుగులో ప్రతి పదానికీ ఒక అర్థం ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాష తెలుగు అని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్సా అని కృష్ణా దేవరాయలు ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు.

ప్రాచీన తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవం సైతం ఇచ్చిందని, తెలుగు భాషను ఎంతో మంది మహానుభావలు కొత్తపుంతలు తొక్కించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే.. అప్పట్లో ఆంధ్ర మహాసభలను నిర్వహించి నిర్బంధాలను దాటారన్నారు. కానీ.. కొంత మంది ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టి చేయడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని అన్నారు. వారసత్వ సంపదను నేటి, భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

మాట్లాడడం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని కిషన్ రెడ్డి చెప్పారు. డిజిటల్ విభాగంలోనూ తెలుగు భాషను క్రోడీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలోనూ మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే.. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే.. వాడుక భాషకు వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 30 శాతం మాత్రమే తెలుగు మాట్లాడుతున్నారని, 70 శాతం ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అంతటా అమలు చేయాలని.. చివరకు కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉండాలని కోరారు.

Tags:    

Similar News