కిషనన్నా.. సికింద్రాబాద్ నుంచి కదులన్నా!

తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మంచి సంఖ్యలో సీట్లు వస్తాయనేది నిన్నమొన్నటి వరకు ఉన్న భావన.

Update: 2024-04-13 16:30 GMT

టార్గెట్ 370 అంటూ ప్రధాని మోదీ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంటే.. తమ కూటమి ఎన్డీఏకు 400 సీట్లు దాటుతాయని ఘంటాపథంగా చెబుతుంటే.. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ ఖాయం అంటూ గొప్పలు పోతుంటే.. అంతా బాగుందనే.. గెలుపు తమదేననే భావన వ్యక్తం అవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణాదిలో ఈసారి భారీగా సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ ఫోకస్ పెట్టింది. కానీ, వారికి కర్ణాటకలో తప్ప ఎక్కడా పెద్దగా బలం లేదు. తెలంగాణలో పుంజుకున్నట్లే కనిపించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసంబద్ధ నిర్ణయాలతో కుదేలైంది.

ఆయన నియోజకవర్గానికే పరిమితమా?

తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మంచి సంఖ్యలో సీట్లు వస్తాయనేది నిన్నమొన్నటి వరకు ఉన్న భావన. అయితే, బీఆర్ఎస్ పుంజుకోకుంటేనే ఇది సాధ్యం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ నాయకత్వంలో చాలా బలంగా వెళ్తోంది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే బీఆర్ఎస్ కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ రెండు పార్టీల నాయకులు ఇలా ఉంటే.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం వేవ్ ను అందిపుచ్చుకునే స్థితిలో లేరని బీజేపీ కేడర్ అంటోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సిన ఆయన తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ కే పరిమితం కావడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తోంది.

పెద్ద నేతలపైనే 16 మంది ఆశ

కిషన్ రెడ్డి సహా తెలంగాణలో మొత్తం 17 సీట్లకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ వీడలేని పరిస్థితుల్లో ఉండడంతో మిగతా 16 మంది అభ్యర్థులు తమ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా రాకపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, మెదక్ లో రఘునందన్ రావు తరఫున కిషన్ రెడ్డి ప్రచారం చేస్తే ఇంకా ఊపు వస్తుంది. కానీ, ఆయన సికింద్రాబాద్ నుంచి కదలడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే..

కిషన్ రెడ్డి సారథ్యంపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ నుంచి అనూహ్యంగా ఎన్నికల ముందు పగ్గాలు అందుకున్న ఆయన అసెంబ్లీ సమరంలో పార్టీని సమర్థంగా నడిపించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. పార్టీకి మంచి ఊపు ఉన్నప్పటికీ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 18 సీట్లలో రెండోస్థానంలో నిలిచింది. కిషన్ రెడ్డి గనుక దూకుడుగా వెళ్లి ఉంటే.. బీజేపీ డబుల్ డిజిట్ కొట్టేది. అప్పుడు రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ, కిషన్ రెడ్డి నిష్క్రియాపరత్వంతో కాంగ్రెస్ కు అధికారం దక్కింది.

Tags:    

Similar News