బీజేపీకి 88 సీట్లు గెలిచేంత సీన్ ఉందా?
కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.
తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుందన్నది వాస్తవమే. బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుండటంతో బీజేపీ బలపడుతోందనే టాక్ వినిపిస్తోంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నది విశ్లేషకుల మాట. కానీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 4 స్థానాల్లో అనూహ్యంగా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బండి సంజయ్ అధ్యక్షుడిగా రావడంతో తెలంగాణలో బీజేపీ దూకుడు అందుకుందన్నది కాదనలేని నిజం. దీంతో 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎక్కువే ఉంటుదనిపించింది. అయితే ఎన్నికలకు ముందు సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. దీంతో బీజేపీ జోష్ తగ్గిపోయింది. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో నెగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ 8 స్థానాలను సొంతం చేసుకుంది.
దీంతో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుస్తామని కిషన్ రెడ్డి అంటున్నారు. కానీ బీజేపీకి అంత సీన్ లేదన్నది విశ్లేషకుల అంచనా. లోక్‌సభ ఫలితాలను చూసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని అనుకోవడం సరికాదు. ఎందుకంటే ప్రధానిగా మోడీ ఉండాలనే లక్ష్యంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనాలు ఓట్లు వేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు అలా కాదు. రాష్ట్రంలోని పరిస్థితులు, పార్టీల తీరుతెన్నులు చూసి ప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది. రోజురోజుకూ బలహీనపడుతున్న బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ అందుకోవాలని చూస్తోంది కానీ అదంత సులువు కాదు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా క్యాడరే లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత పుంజుకోవచ్చు కానీ అధికారం చేపట్టేంత సీన్ మాత్రం ఉండదన్నది టాక్.