కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో బాగా టార్గెట్ అవుతున్నారా ?
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో బాగా టార్గెట్ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో బాగా టార్గెట్ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కాకపోతే మామూలు నెటిజన్లకు తోడు సొంతపార్టీ నేతల మద్దతుదారులు కూడా కలవటమే కిషన్ కు పెద్ద తలనొప్పిగా తయారైందట. కిషన్ అంటే చాలాకాలంగా కొందరు సీనియర్లకు పడటంలేదు. దానికితోడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను సడెన్ గా మార్చిన అగ్రనేతలు కిషన్ కు బాధ్యతలు అప్పగించారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామాన్ని బండి వర్గీయులతో పాటు కిషన్ వ్యతిరేకులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో కిషన్ అంటే పడనివాళ్ళు ఏకమై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు మొదలుపెట్టారట. ఎన్నికలు దగ్గరకు వచ్చినా, అయిపోయిన తర్వాత కూడా కిషన్ వ్యతిరేకత సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గలేదు. అయితే ఫలితాల్లో పార్టీకి 8 సీట్లు రావటంతో కిషన్ పై వ్యతిరేక పోస్టులు కొంత తగ్గాయి. నిజానికి అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదు.
ఇదే సమయంలో ఏ సర్వే చూసినా బీజేపీకి 2 లేదా 3 స్ధానాలు వస్తే చాలా ఎక్కువన్నట్లుగానే జోస్యాలు చెప్పాయి. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వచ్చినపుడు బీజేపీకి కొద్దిగా ఊపుకనిపించింది. ఫలితాల్లో చూస్తే 8 సీట్లు రావటం గొప్ప విషయమనే అనుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్న మూడు సీట్ల నుండి పార్టీ బలం 8 సీట్లకు పెరిగింది. దాంతో కిషన్ను టార్గెట్ చేయటం కొంత తగ్గింది.
అయితే ఈమధ్య మళ్ళీ టార్గెట్ చేయటం బాగా పెరిగిపోయిందట. సొంతపార్టీలోని నేతలే తమ మద్దతుదారులతో తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నట్లు కిషన్ ఇప్పటికే కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేశారట. అయితే తన ఫిర్యాదులో ఎవరెవరి పేర్లను కిషన్ రెడ్డి ప్రస్తావించారనే విషయంలో క్లారిటి లేదు. బండిని మార్చకుండా కంటిన్యు చేసుంటే బీజేపీకి ఇంకా మంచి ఫలితాలు వచ్చుండేవనే చర్చ ఇప్పటికీ కమలనాదుల్లో జరుగుతునే ఉంది. అయితే దానికి కిషన్ ఎంతవరకు బాధ్యుడు అన్న పాయింటే చాలా కీలకం. ఏదేమైనా కిషన్ను తొందరలోనే బాద్యతలనుండి తప్పిస్తారనే చర్చ కూడా పెరిగిపోతోంది.