మాజీ మంత్రి కొడాలి అరెస్టుకు రంగం సిద్ధం! అస్సాంలో గడ్డం గ్యాంగ్ లీడర్ అరెస్టు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి.

Update: 2024-12-31 10:05 GMT

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ రెడ్ బుక్ చాప్టర్ 3లో కొడాలి పేరు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చాప్టర్-3 ఓపెన్ చేస్తున్నానని, గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీనిలో భాగంగా గుడివాడలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం కేసులో కొడాలి ముఖ్య అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు. తాజాగా అస్సాంలో తలదాచుకున్న కొడాలి ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాశీని అరెస్టు చేశారు.

గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పరుష పదజాలంతో విరుచుకుపడిన అప్పటి మంత్రి కొడాలి నాని టార్గెట్ గా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చిన నానిపై రెండు కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం... ఆ కేసుల్లో నాని బెయిల్ తెచ్చుకోవడంతో విడిచిపెట్టింది. అయితే నానిని ఎలాగైనా అరెస్టు చేసి జైలు ఊచలు లెక్క పెట్టించాలనే పట్టుదలగా ఉన్న కూటమి నేతలు.. ఆయనపై గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2022 డిసంబర్ 25న గుడివాడలో టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లోనే కేసు నమోదైనా, అప్పటి మంత్రి కొడాలి ప్రమేయంతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరంతా వైసీపీ కార్యకర్తలేనని గుర్తించారు. ఇక కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ క్రిష్ణా జిల్లా యూత్ ప్రెసిడెంట్ మెరుగుమాల కాశీని అరెస్టు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసులు తన కోసం వేటాడుతున్నారని గుర్తించిన కాశీ, గుడివాడ నుంచి పారిపోయి అస్సాంలో తలదాచుకుంటున్నాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు అక్కడ చేపల మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్న కాశీని అరెస్టు చేసినట్లు సమాచారం.

గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసును మంత్రి లోకేశ్ సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో పోలీసులు ఈ నేరంతో సంబంధం ఉన్న వారిలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అరెస్టు అయిన 13 మందితోపాటు తాజాగా అరెస్టు అయిన గడ్డం గ్యాంగ్ లీడర్ కాశీని విచారించి అసలు సూత్రధారులను గుర్తించనున్నారంటున్నారు. నిందితుల్లో కొందరు మాజీ మంత్రి కొడాలి నాని పేరు చెప్పినట్లు సమాచారం. అయితే వారు చెప్పిన మాటల్లో నిజం ఉందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించిన తర్వాతే పోలీసులు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News