8 గంటల పాటు కొడాలి నానికి బైపాస్ సర్జరీ.. అభిమానుల్లో ఆందోళన
మాజీ మంత్రి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో గుండె బైపాస్ సర్జరీ బుధవారం ప్రారంభమైంది.;

మాజీ మంత్రి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో గుండె బైపాస్ సర్జరీ బుధవారం ప్రారంభమైంది. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఛాతీలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన గుండెలోని మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యుల సూచన మేరకు ముంబై ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపటి క్రితం ముంబైలో ఆయనకు బైపాస్ సర్జరీ ప్రారంభమైంది. ఈ సమయంలో వైద్యులు కీలక సమాచారం అందించగా, గుడివాడలోని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో కొడాలి నానికి బైపాస్ సర్జరీ కొనసాగుతోంది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం ఆయన నాని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బైపాస్ సర్జరీ అనంతరం నాని పూర్తిగా కోలుకుంటారని వైద్యులు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన కొడాలి నానికి గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ఆయన గుండెలోని మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించినప్పటికీ, మూడు వాల్వ్స్‌లో బ్లాకులు ఉండటంతో బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. దీంతో కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గత వారం ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరగా, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో గుండెలోని మూడు కవాటాల్లో తీవ్రమైన బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యకు బైపాస్ సర్జరీ చేయడమే సరైన మార్గమని వైద్యులు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించినట్లు తెలుస్తోంది.
వైద్యుల సూచన మేరకు ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకోవాలని కొడాలి నాని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయనను బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో ఆయనకు శస్త్రచికిత్స జరుగుతోంది. డాక్టర్ పాండే గతంలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు పలువురికి విజయవంతంగా బైపాస్ సర్జరీలు నిర్వహించారు.
కాగా కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, ఆయనకు మనోధైర్యాన్ని అందిస్తున్నారు. సర్జరీ అనంతరం కొడాలి నాని దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా గుడివాడలో కొడాలి నాని అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. నానికి జరుగుతున్న సర్జరీ విజయవంతం కావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు గుడివాడలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.