కొడాలి నానికి 2025 లో కొత్త షాకులు ?
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ చంద్రబాబును చాలా గట్టిగానే టార్గెట్ చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి కొత్త ఏడాది 2025 బొత్తిగా కలసి రాదా అన్న చర్చ సాగుతోంది.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ చంద్రబాబును చాలా గట్టిగానే టార్గెట్ చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి కొత్త ఏడాది 2025 బొత్తిగా కలసి రాదా అన్న చర్చ సాగుతోంది. వరసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచి తనకు ఎదురులేదనిపించుకున్న కొడాలికి 2024 ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఆయన్ని ఓడించి బహు మొనగాడు అనిపించుకున్నారు ఎన్నారై వెనిగండ్ల రాము. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడలో దూకుడు చేస్తున్నారు.
ఓటమి తరువాత కొడాలి నాని గత ఆరేడు నెలలుగా ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆయన బలంగా పోషించిన క్యాడర్ కూడా ఇబ్బంది పడుతోంది. అందులో ముఖ్య నాయకుల పరిస్థితి అయితే ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో కొడాలికి అతి ముఖ్య అనుచరుడిగా ఉన్న మెరుగుమాల కాళీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆయన మీద ఉన్న పాత కొత్త కేసులను తిరగతోడుతున్నారు.
ఇక ఆయన నుంచి కీలకమైన సమాచారం రాబడితే కచ్చితంగా కొడాలి నానికి ఎక్కడో ఒక చోట ఉచ్చు బిగించవచ్చు అన్నది ఒక వ్యూహంగా ఉంది అంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడను అంటోంది. అయితే అదే సమయంలో తమ చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తగా వైసీపీలో ఒక రేంజిలో తమ మీద చెలరేగిన నేతలకు చెక్ పెట్టేలా పధక రచన చేస్తోంది అని అంటున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని కలలో కూడా ఊహించని విధంగా గొడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో ఇరుక్కున్నారు. ఇందులో ఆయన సతీమణి ఇపుడు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఏ 6గా ఉన్న పేర్ని నానిని కూడా అరెస్ట్ చేయవచ్చు అన్నది వినిపిస్తున్న టాక్.
అదే సమయంలో మరో నాని ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి అరెస్ట్ అంటూ ఇపుడు వార్తలు వస్తున్నాయి. 2025లోకి అడుగు పెట్టిన వెంటనే ఈ వార్తలు అధికం కావడం విశేషం. కొడాలి నానిని అరెస్ట్ చేసి తీరాలని టీడీపీ తమ్ముళ్ళు ఎప్పటి నుంచో రగులుతున్నారు. అయితే అచ్చం వైసీపీ మాదిరిగా బాహాటంగా వ్యవహరిస్తే అరెస్ట్ ఫలితం దక్కకపోగా సానుభూతి వారికి వెళ్తుంది
అందుకే టీడీపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. పట్టుబడిన నాని అనుచరుల ద్వారానే మ్యాటర్ ని లాగి అందులో కొడాలి నాని ఉన్నారని ఎక్కడో ఒక కేసులో బిగించి అరెస్ట్ పర్వానికి తెర తీస్తారు అని అంటున్నారు.
అయితే ముందుంది సంక్రాంతి పండుగ. మరి ఈ పండుగ తరువాత ఈ అరెస్టులు ఉంటాయా లేక ముందు ఉంటాయా అన్నదే చర్చ. ముందు అరెస్టులు ఉంటే సంక్రాంతి సందడిలో అవి కాస్తా కలసిపోయి సద్దుమణగిపోతాయేమో అన్న ఆలోచన కూడా ఉందిట. ఏది ఏమైనా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అదిగో ఇదిగో అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటను కొత్త ఏడాదిలో తొందరలోనే నిజం చేయబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే నిజమేమో అనిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.