తొంబై రోజులైంది...కొడాలి నాని విషయంలో తీవ్ర అసంతృప్తి !
అంతే కాదు ఏపీలో అనేక చోట్ల నాని మీద కేసులు పెట్టారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన మీద అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కావడం అంతా ఒక వ్యూహం ప్రకారం అని అంటున్నారు. లేటెస్ట్ గా కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఒక న్యాయవాది కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మీద అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాని మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన కోరారు.
అంతే కాదు ఏపీలో అనేక చోట్ల నాని మీద కేసులు పెట్టారు. గుడివాడలో అయితే నాని రాజకీయానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నాని అనుచరులు ఆక్రమించారని చెబుతున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓటమి తరువాత గుడివాడలో నాని అడుగుపెట్టలేని విధంగా పరిస్థితిని కల్పించారు. ఒక విధంగా చెప్పాలీ అంటే నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన అక్కడ నుంచే తన మీద నమోదు అయిన అన్ని కేసులకు సంబంధించి బెయిల్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఒక వైపు మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చూస్తోంది.
ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇపుడు మళ్ళీ కొడాలి నాని వైపుగా రాజకీయం మళ్ళింది అని అంటున్నారు. ఇంత కాలం మౌనంగా ఉన్న కొడాలి నాని వరద సహాయ చర్యల మీద ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. ఆయన గతంలోలా అసభ్య పదజాలం ఉపయోగించకపోయినా ప్రభుత్వ తీరుని తప్పు పట్టారు. దాంతో పాటుగా గుడివాడలో తన రాజకీయాని మళ్లీ గట్టి పరచుకోవడానికి నాని చూస్తున్నారు అని అంటున్నారు
నిజానికి ఓటమి తరువాత కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతామని అనుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఆయన మీద వరసగా కేసులు పెట్టడం టార్గెట్ చేయడంతో రాజకీయంగానే వాటిని ఎదుర్కోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దాంతో పాటు తన అనుచరులకు ధైర్యం చెబుతూ మంచి రోజులు వస్తాయని నాని అంటున్నారు
దాంతో గుడివాడలో నాని ఎంట్రీ తొందర్లోనే ఉంటుందని కూడా ఒక టాక్ నడుస్తోంది. నాని తప్ప గుడివాడ వైసీపీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఒక పిలుపు ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. గుడివాడలో వైసీపీ అన్న పేరు వినిపించకూడదు అన్న పట్టుదలతో టీడీపీ పనిచేస్తోంది.
మరో వైపు చూస్తే నాని తన అనుచర గణాన్ని కాపాడుకోవడమే కాకుండా టీడీపీకి సరైన సమయంలో కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి తొంబై రోజులు అయినా కొడాలి నానిని అరెస్ట్ చేయకపోవడం పట్ల టీడీపీ శ్రేణులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. కొడాలి నానినే ఫస్ట్ అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు.
అయితే అది మాత్రం జరగలేదు. నాని కూడా అజ్ఞాతంలో ఉంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని అరెస్ట్ అన్నది ఆలస్యమే అయింది. అయితే టీడీపీ కూటమి ఎత్తులకు నాని పై ఎత్తులు వేస్తూ సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడ వరదలతో నిండా పనిలో పడిన టీడీపీ పెద్దలు ఇపుడిపుడే ఉపశమనం పొందుతున్నారు. దాంతో వారు మళ్లీ రాజకీయంగా ఫోకస్ పెడుతున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తొందరలోనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని టీడీపీ కూటమి పెద్దలు అయితే పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు. కొడాలి నాని అరెస్టు టీడీపీకి ఇపుడు అతి ప్రధానంగా ఉంది అని అంటున్నారు. మరి నాని బెయిల్ ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూడాలి.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నానిని కట్టడి చేస్తేనే రాజకీయంగా అది అతి పెద్ద విజయం అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ గుడివాడ వైపుగా మళ్ళుతున్నాయని అంటున్నారు.