ముద్దసాని కోదండరాం.. తెలంగాణ మంత్రి.. ఆదిలాబాద్ బెర్తు ఖాళీ అందుకే?

కోదండరాం అసలు పూర్తి పేరు ముద్దసాని కోదండరాం రెడ్డి. అయితే, కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించే ఆయన తన కులాన్ని సూచించే పేరును తన పేరు నుంచి తొలగించుకున్నారు.

Update: 2024-08-17 09:30 GMT

తెలంగాణవాదులు, ఉద్యమకారులకు ప్రొఫెసర్ జయశంకర్ ‘పెద్ద సారు’ అనుకుంటే.. ప్రొపెసర్ కోదండరాంను 'చిన్న సారు' అనాలి. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ ఎంతటి పాత్రను పోషించారో.. మలి దశ కోదండరాం అంతటి పాత్రను భుజానకెత్తుకున్నారు. 2009 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని, ఉద్యమంలో వెనుకబడిన నాటి టీఆర్ఎస్ పార్టీ, దాని అధినేత కేసీఆర్ కు ‘ఒక తటస్థ వ్యక్తి’ ద్వారా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అలా కోదండరాం నాయకత్వంలో సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలుపుకొని.. ఉద్యమాన్ని తీవ్రం చేశారు. తెలంగాణ సాధనలో కోదండరాం అలా చరిత్రలో నిలిచిపోయారు.

అధికారానికి ఎంత చేరువో అంత దూరం బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉన్న, కేసీఆర్ ఘనంగా పొగిడిన కోదండరాం సరిగ్గా తెలంగాణ సాకారం అయ్యే సమయానికి 2014లో కేసీఆర్ కు దూరమయ్యారు. దీనికి కారణం ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు కాకుండా కాంగ్రె వైపు మొగ్గారనే అనుమానం రావడమే. అయితే, కోదండరాం నేరుగా అలా చేయకున్నా.. ఆయన మీద అలాంటి అభిప్రాయం ఏర్పడింది. దీంతో కేసీఆర్ ఆయనను పూర్తిగా పక్కనపెట్టారు. తెలంగాణను, కేసీఆర్ ను కూడా తీవ్రంగా వ్యతిరేకించిన వారిని అక్కున చేర్చుకున్నా.. కోదండరాంను మాత్రం క్షమించలేదు. చివరకు ఓ దశలో ఆయనను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇలాంటి అవమానాలను మౌనంగానే ఎదుర్కొన్న కోదండరాం.. 2018లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరిట ప్రత్యేక పార్టీని స్థాపించారు. పార్టీ కార్యాలయంపైన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనిఖీలు చేయించడం వేరే సంగతి.

ఎట్టకేలకు ఎమ్మెల్సీ..

ఉద్యమకారుడిగానే మిగిలిపోవడం కంటే రాజకీయ ప్రస్థానం మేలనుకుని కోదండ రాం పార్టీని స్థాపించినా ఆయనకు చేదు ఫలితాలే వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండ పరాజయం పాలయ్యారు. అయితే, 2023 ఎన్నికల నాటికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ కు మద్దతివ్వడం ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కోదండ ప్రాధాన్యం పెరిగింది. నెలలోపే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. కారణాల రీత్యా ఆలస్యం జరిగినా ఆయన శుక్రవారం ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో చిరకాల స్వప్నంగా మారిన చట్టసభల ప్రవేశాన్ని సాకారం చేసుకున్నారు.

ప్రజా పాలనలో ఇక మంత్రి పదవేనా?

కోదండ రాంను తెలంగాణ మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు మొదటినుంచి ఉన్నాయి. కేసీఆర్ నియంత పాలనకు భిన్నంగా ప్రజా పాలన అందిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం వంటి ప్రజాస్వామ్యవాది, హక్కుల ఉద్యమకారుడిని మంత్రిని చేయడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని చెబుతన్న ఉద్యమకారుల మద్దతూ దక్కుతుంది. కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు గట్టి వాయిస్ కూడా దొరుకుతుంది.

ఆదిలాబాద్ బెర్తు ఆయనకేనా?

తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలున్నాయి. హైదరాబాద్ సహా నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వాటిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ఈ లెక్కన కోదండరాంను మంత్రిని చేయడం ద్వారా ఆదిలాబాద్ కు మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. లేదంటే.. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గా ఆయన కార్యక్షేత్రం హైదరాబాద్ కు అయినా మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. తెలంగాణ సీం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చాక కానీ, ఏ విషయమైనదీ తెలియదు.

కోదండరాం అసలు పూర్తి పేరు ముద్దసాని కోదండరాం రెడ్డి. అయితే, కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించే ఆయన తన కులాన్ని సూచించే పేరును తన పేరు నుంచి తొలగించుకున్నారు.

Tags:    

Similar News