వేటుకు వేళాయె.. ఎమ్మెల్యే కొలికిపూడికి అధిష్టానం హెచ్చరిక

ఎమ్మెల్యేగా గెలిచిన ఏడు నెలల్లో రెండోసారి ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లైంది.

Update: 2025-01-19 05:02 GMT

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై క్రమశిక్షణ చర్యలకు టీడీపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసింది. 20వ తేదీ సోమవారం పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలని ఎమ్మెల్యేకు సూచించింది. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడు నెలల్లో రెండోసారి ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లైంది.

అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న తిరువూరు శాసనసభ్యుడు కొలికిపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస వివాదాలతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న ఎమ్మెల్యేను పిలిపించి వివరణ తీసుకోవాలని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలని కొలికపూడిని ఆదేశించారు.

అమరావతి రైతు ఉద్యమ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన కొలికపూడికి ఎన్నికల్లో పిలిచిమరీ టీడీపీ టికెట్ ఇచ్చారు. అయితే ఆయన గెలిచిన రెండో రోజు నుంచే వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వివాదాస్పద వైఖరితో వ్యక్తిగతంగా అప్రతిష్ఠ మూటగట్టుకోవడమే కాకుండా పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యేతో వేగలేక సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు గతంలో ధర్నాలు చేశారు.

వరుస సంఘటనలతో ఆయనను పిలిచి గతంలో ఓ సారి వివరణ తీసుకున్నారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ ఎంతలా చెప్పినా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోలేదని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణం సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో ఎమ్మెల్యే కల్పించుకుని ఓ గిరిజనుడిపై చేయిచేసుకున్నారని చెబుతున్నారు. దీన్ని తట్టుకోలేక ఆ గిరిజనుడి భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేను మందిలిచినట్లు సమాచారం. ఇక రెండు రోజుల క్రితం తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం.. పార్టీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై చర్చ జరగగా, ఆయనను క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించారు.

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చైర్మన్ గా ఉన్న టీడీపీ క్రమశిక్షణ సంఘంలో వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, బీద రవిచంద్రయాదవ్, ఎంఏ షరీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వంతు వచ్చింది. కొలికపూడిపై సస్పెన్షన్ వంటి తీవ్ర చర్య తీసుకుంటారా? లేక మరోసారి మందలించి వదిలేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News