టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన... వీడియో!

అవును... తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు

Update: 2024-07-21 05:55 GMT

ఏపీలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయనేది తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఇది కూడా ఒక కారణం! ఈ నేపథ్యంలో... కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రోడ్లపై గుంతలు పుడ్చడంపై ఇప్పటికే చంద్రబాబు అధికారులు ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. ఈ సమయంలో... టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వినూత్న నిరసన తెలిపారు.

అవును... తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. ఈ సమయంలో... వార్డులో వర్షం నీరు నిల్వ ఉండటాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకొవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో సుమారు గంటపాటు వర్షంలోనే నిరీక్షించారు.

ఈ మేరకు వర్షంలోనే రోడ్డు మధ్యలో ఉన్న గుంతల వద్ద స్టూల్ వేసుకుని కూర్చుని తన నిరసన తెలిపారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... గుంతలను ఎందుకు పూడ్చలేదంటూ రోడ్లు, భవనాల శాఖ అధికారులను ప్రశ్నించారు. వాస్తవానికి అధికారుల నిర్లక్ష్యంపై కొలికపూడి నిరసన తెలపడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మగురుగు కాలువలో దిగి నిరసన తెలిపిన కొలికపూడి... ప్రస్తుతం అధికార పక్షం ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో టౌన్ లో ఎమ్మెల్యే తిరుగుతున్నారని తెలియడంతో స్థానికులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా సమస్యలు ఏకరువు పెట్టారు.

ఇందులో భాగంగా... తమ ప్రాంతంలో ఉన్న రోడ్లు దుస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని వాపోయారు. దీంతో మరింత సీరియస్ గా రియాక్ట్ అయిన ఎమ్మెల్యే కొలికపూడి.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. రోడ్ల మరమ్మతులకు మంజూరైన నిధులు ఏమయ్యాయంటూ నిలదీశారు.

ఇదే సమయంలో... రోడ్ల మరమ్మతులు ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరారు. దీంతో... ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ఇలా ప్రజాసమస్యలను స్వయంగా పర్యవేక్షించి అధికారులతో మాట్లాడటం మంచి విషయమని కొంతమంది అంటుంటే.. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News