కొల్లు వారి ప్రిడిక్షన్.. నెక్ట్స్ ఆ ఇద్దరే...

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆ పార్టీ నేతలను బెదిరించేలా కూటమి పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Update: 2025-02-16 16:43 GMT

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆ పార్టీ నేతలను బెదిరించేలా కూటమి పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టు అయ్యేవారి లిస్టులో నెక్ట్స్ వారేనంటూ తమకు తోచిన పేర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన పలువురు నేతలను అరెస్టు చేస్తామంటూ టీడీపీ నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నెక్ట్స్ అరెస్టు అయ్యేది వీరేనంటూ ఓ నాలుగు పేర్లు చెప్పగా, తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా అదే తరహా కామెంట్స్ చేశారు. వైసీపీ నేతల్లో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను నెక్ట్స్ అరెస్టు అవుతారని మంత్రి కొల్లు జోస్యం చెప్పారు.

వల్లభనేని అరెస్టు తర్వాత ఉమ్మడి క్రిష్ణా జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధానంగా ఈ జిల్లాకు చెందిన వైసీనీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ వంటివారిపై వివిధ కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలు కొడాలి, వల్లభనేని ఇళ్లపై దాడులకు దిగారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు అండర్ గ్రౌండ్ లోనే గడుపుతున్నారు. కొడాలిపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ లభించగా, వల్లభనేనికి ఒక కేసులో బెయిల్ మంజూరైంది. అయితే అనూహ్యంగా కిడ్నాప్ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఇక పేర్ని నానిపై బియ్యం అక్రమ రవాణా కేసు, జోగి రమేశ్ పై అగ్రి గోల్డ్ భూముల అన్యాక్రాంతం కేసుతోపాటు భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై కేసు నమోదు అవగా, ఆయన ప్రస్తుతం కోర్టు రక్షణలో ఉన్నారు.

ఇక వల్లభనేని అరెస్టు తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారనేది రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. అగ్రి గోల్డ్ కేసులో జోగి రమేశ్ కుమారుడిని అరెస్టు చేయగా, ఆయనను ఎప్పుడైనా ఏ కేసులోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడమే కాకుండా, ఆయనను వ్యక్తిగతంగా తూలనాడిన జోగిపై టీడీపీ క్యాడర్ కసి పెంచుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం జోగి రమేశ్ కన్నా కొడాలి, పేర్నిపైనే టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ తర్వాత ఆ స్థాయిలోనే బూతులతో నోరు పారేసుకున్న కొడాలిని అరెస్టుచేయాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతోందని అంటున్నారు. అయితే ఆయనపై నమోదైన కేసుల్లో ప్రస్తుతం బెయిల్ లభించింది. అయినప్పటికీ ఆయన బయటకు రావడం లేదు. కొడాలి బయటకు వచ్చి రాజకీయంగా యాక్టివ్ అయితే ఏ కేసులోనైనా అరెస్టు చేస్తారనే అనుమానం ఉందని అంటున్నారు. ఇక రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల్లో కూడా ఆయనను నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక మరోనేత పేర్ని నానిపై ఇప్పటికే బందరులో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైంది. దీనిపై ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆయన సతీమణి ముందస్తు బెయిల్ పై బయట ఉన్నారు. అయితే పేర్ని కూడా గత ప్రభుత్వంలో రెచ్చిపోయారంటూ టీడీపీ, జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. ఆయనను ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక మచిలీపట్నంలో పేర్నికి రాజకీయ శత్రువుగా ఉన్న కొల్లు రవీంద్ర అయితే మరింత గట్టిగా పట్టుబడుతున్నారు. నెక్ట్స్ అరెస్టు పేర్నినే చేయాలంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన పాపాలే నేడు వారికి శాపాలుగా మారాయని చెబుతున్న మంత్రి కొల్లు వైసీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలు, అవినీతిపై ప్రత్యేకంగా విచారణ జరిపించి అరెస్టు చేయిస్తామంటున్నారు. దీంతో ఏపీలో రాజకీయం రోజురోజుకు హీట్ పుట్టిస్తోంది.

Tags:    

Similar News