'కేసీఆర్ స్థానంలో నేనే ఉంటే'... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
నల్గొండలో నిర్వహించిన "రైతు ధర్నా" కార్యక్రమంలో తనపై కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
నల్గొండలో బీఆరెస్స్ పార్టీ "రైతు ధర్నా" కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మైకందుకున్న కేటీఆర్... బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడకో నైజాం సర్కారోడా అని ఆనాటి నియంతలను నిలదీసిన నల్గొండ గడ్డకు కాంగ్రెస్ నేతలు, వాళ్ల పాపాలు కొత్తవి కావంటూ ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలోని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లను టార్గెట్ చేశారు. వాళ్లిద్దరికీ ఆకరాలు పెరిగాయ్, అహంకారాలు పెరిగాయ్.. వాళ్లు నల్గొండకు చేసిందేమీ లేదు అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... నల్గొండలో నిర్వహించిన "రైతు ధర్నా" కార్యక్రమంలో తనపై కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా... నల్గొండ, భువనగిరి ఉమ్మడి జిల్లాల్లో తాను ఎక్కడ నిలబడినా గంటలో 5 వేల మంది గుమిగూడుతారని చెప్పిన మంత్రి... బీఆరెస్స్ నిర్వహించిన రైతు ధర్నాలో జనాలే లేరని అన్నారు.
తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో పల్లీలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ రైతు మహదా ధర్నాలో కనిపించలేదని సెటైర్లు వేశారు. నల్గొండలో ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచి పోషించిందే బీఆరెస్స్ అని.. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ 11 సీట్లలో విజయం సాధించిందని తెలిపారు.
ఇలా జిల్లాలో ప్రజలు బీఆరెస్స్ ను కొట్టిన దెబ్బకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా జిల్లాలో ఒకే ఒక్క సీటుకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. పైన కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టి కిందకూ కాలువను కూడా వదలని మానవత్వం లేని మనిషి రూపాల్లో ఉన్న మృగాలు బీఆరెస్స్ నేతలని ధ్వజమెత్తారు. బీఆరెస్స్ రైతు ధర్నా ఓ డ్రామా అని అన్నారు.
ఇదే సమయంలో... ‘ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా వస్తావా కేసీఆర్’ అని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... రాని పక్షంలో రాజీనామా చేసి బాధ్యతలు అల్లుడికో, కోడుక్కో అప్పచెప్పు అని సూచించారు. ఈ సందర్భంగా తండ్రి చాటు కొడుకు అంటూ కేటీఆర్ ని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి... తనలాగా ఆయన మాస్ లీడర్ కాదని అన్నారు.
ఇక.. నల్గొండ మీటింగ్ లో తనను వాడు, వీడు అని సంబోధిస్తూ చాలా మాటలు అన్నారని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... కేటీఆర్ తన కంటే చిన్నోడని, అమెరికాలో చదువుకుని వచ్చి ఆ మర్యాదే నేర్చుకున్నాడని అన్నారు. తాను కూడా తిట్టటం మొదలుపెడితే.. ఆ మాటలకు తలలు పగిలి చచ్చిపోతారని, అందుకే తిట్టదలచుకోలేదని తెలిపారు!
ఈ నేపథ్యంలోనే.. బీఆరెస్స్ అనేది త్వరలో మూతపడే దుకాణమని.. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి.. 9 పార్లమెంట్ సీట్లలో 3వ స్థానం వచ్చిందని.. 7 సీట్లలో డిపాజిట్లు పోయిందని అన్నారు. ఈ క్రమంలో.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ చాలా నమయమని.. లాలూ జైల్లో ఉంటే ముప్పైఏళ్ల ఆయన కొడుకు ఎన్నో ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో గెలిపించుకున్నాడని అన్నారు.
అయితే... జైలుకు పోకున్నా బయటే ఉన్న కేసీఆర్ 16 స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదని అన్నారు. తానే కేసీఆర్ స్థానంలో ఉంటే పార్టీని మూసేసి వెళ్లి వ్యవసాయం చేసుకునేవాడినని చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.