టీడీపీకి ఊపు తెస్తున్న యువ మంత్రి.. గజపతినగరంలో పసుపు జెండా రెపరెపలు
ఇక విజయనగరం జిల్లాలోనూ యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు జరిగాయి.;

టీడీపీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన వేడుకల కోసం టీడీపీ నేతలు పోటీపడ్డారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటివాటితో టీడీపీ కేడర్ లో జోష్ నింపింది. దీంతో అటు సిక్కోలు నుంచి ఇటు చిత్తూరు వరకు పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ పండగను నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రలు పర్యవేక్షణలో ఎక్కడిక్కడ కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇక విజయనగరం జిల్లాలోనూ యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు జరిగాయి. గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ కూటమి మరింత బలపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటుండటంతో ఈ సారి పార్టీ ఆవిర్భావ వేడుకలకు చాలా మంది హాజరయ్యేలా ఉపయోగపడింది. పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నవారు సైతం మంత్రి పనితీరును మెచ్చి ముందువరుసలో నిల్చొని పార్టీ వేడుకలను నిర్వహించారు.
మంత్రి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం గజపతినగరంలో అయితే సంబరాలు అంబరాన్ని తాకాయి. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిభిరాలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు.గజపతినగరంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి.. దిశా నిర్దేశం చేస్తూ, గ్రామ స్థాయిలో కార్యక్రమాలను ముందుండి నడిపించారు. మంత్రి పిలుపుతో పాటుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలు.. నాయకత్వం కొన్ని గ్రామాల్లో ముందస్తు షెడ్యూల్ కారణంగా అందుబాటులో లేకపోయినా, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.
తాను హాజరు కాలేకపోయిన కార్యక్రమాలను నిర్వహించిన కార్యకర్తలతో, నాయకులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన మంత్రి, పలువురిని అభినందించారు. పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉన్న నాయకులు కూడా మంత్రి పిలుపుతో ముందుకు వచ్చారు. ఇక ఉత్తరాంధ్రలో ఇతర నాయకులు సైతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల పల్లెల్లో సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఓ పండుగగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం గమనార్హం. ఇక పార్టీ జాతీయ కార్యాలయంలో సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది అధిష్టానం.