కోదండ‌రాంకు మంత్రి ప‌ద‌వి.. నిజ‌మేనా?

ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ఆయ‌న‌కు ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీనిని ఇటీవ‌ల సాకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలుంటే.. వాటిలో ఒక‌టి కోదండ‌రాంకు కేటాయించారు.

Update: 2024-01-27 14:30 GMT

ఉస్మానియా యూనివ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్‌, విద్యావేత్త‌, మేధావి.. ప్రొఫెస‌ర్ కొదండ‌రాంకు కీల‌క ప‌ద‌వి ద‌క్కుంద‌ని, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఆయ‌న కీల‌కం కానున్నార‌ని.. వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అయితే.. దీనిలో నిజ‌మెంత‌? అనేది ఆస‌క్తిగా మారింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌రోల్ పోషించిన కోదండరాం.. కేసీఆర్ హ‌యాంలో కొంత ఇబ్బందుల‌కు గుర‌య్యారు. రాజ‌కీయంగా కూడా.. ఆయ‌న దూరంగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపారు. పోటీకి దూరంగా ఉండి.. ప్ర‌చారంలో పాల్గొన్నారు. మేధావుల‌నుఏకం చేసి కాంగ్రెస్ గెలుపున‌కు కృషి చేశారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ఆయ‌న‌కు ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీనిని ఇటీవ‌ల సాకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలుంటే.. వాటిలో ఒక‌టి కోదండ‌రాంకు కేటాయించారు. ఇంత వ‌ర‌కు ఓకే. అయితే.. ఇప్పుడు మంత్రివ‌ర్గంలో కీల‌క స్థానాలు ఖాళీలు ఉండ‌డంతో విద్యాశాఖ‌కు ఆయ‌న‌ను మంత్రిని చేసే అవ‌కాశం ప‌రిశీల‌న‌లో ఉన్న మాట నిజ‌మే.

విద్యావేత్త‌గా, గురువుగా కోదండ‌రాం ప్ర‌ఖ్యాతి చెందారు. పైగా మేధావి వ‌ర్గంలోనూ ఆయ‌న ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విద్యాశాఖ‌ను ఆయ‌న‌కు అప్ప‌గించ‌డంద్వారా.. అన్ని వ‌ర్గాల నుంచి మ‌న్న‌న‌లు పొందే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి భావించి ఉంటారు. అందుకే ఆయ‌న‌ను నేరుగా ఎమ్మెల్సీ నుంచి మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అంశంపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని, పార్టీ అధిష్టానం ఓకే చెబితే.. కోదండ‌రాంను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ త‌న స‌త్తా చాటాల‌ని చూస్తున్న రేవంత్‌రెడ్డి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనేందుకు ఇప్ప‌టికే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు.. మేధావిగా పేరున్న కోదండ‌రాంకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం.. అనంత‌రం.. మంత్రి ప‌ద‌వి ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా ఉద్య‌మ నాయ‌కుల‌కు పార్టీ గుర్తింపు ఇస్తోంద‌న్న వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌లోకి తీసుకువెళ్లి త‌ద్వారా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ల‌బ్ధి పొందే వ్యూహం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


Tags:    

Similar News