ఐప్యాక్, వాలంటీర్ వ్యవస్థలపై మాజీమంత్రి కొట్టు ఫైర్!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే

Update: 2024-06-08 15:22 GMT

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఓటమిపై జగన్ & కో ఆఫీసులో చేసిన రివ్యూల సంగతి కాసేపు పక్కనపెడితే... వారికి వారు చేసుకున్న రివ్యూలు, అంచనాలు, అభిప్రాయాలు, అనుభవాలను ఆ పార్టీ నేతలు బహిరంగంగా మైకుల్లో చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

ఇందులో భాగంగా... ఏపీలో తమ పార్టీ ఘోర పరాజయానికి వాలంటీర్ వ్యవస్థే కారణమని మాజీమంత్రి అమర్నాథ్, సిదిరి అప్పలరాజు వంటివారు చెబ్బుతుండగా... సీఎంకి మంత్రులకు మధ్య ఉన్న కొంతమందే ఈ ఘోర ఓటమికి కారణమన్నట్లుగా కేతిరెడ్డి లాంటి వారు చెబుతున్నారు. ఈ సమయంలో అంతకుమించిన మరో కారణం ఉందంటూ ముందుకు వచ్చారు మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ.

అవును... ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి పొందడానికి గల కారణాలను వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని తెలిసినా... బహిరంగంగానే ఆ పనికి పూనుకుంటున్న పరిస్థితి ఇప్పుడు వైసీపీ నేతల్లో నెలకొన్న పరిస్థితి! ఈ సమయంలో కొట్టు సత్యనారాయణ స్పందించారు.

తాజాగా తాడేపల్లిగూడెం వైసీపీ విసృతస్థాయి సమావేశంలో మాట్లాడిన మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ... తమ పార్టీ ఘోర ఓటమికి వాలంటీర్ వ్యవస్థ, ఐ-ప్యాక్ టీమే కారణం అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో జగన్ అనుసరించిన వైఖరి కూడా కారణం అంటూ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇందులో భాగంగా... ప్రజలకు మంచి చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే వైఎస్ జగన్ రెండు అడుగులు ఎక్కువ వేసినప్పటికీ కార్యకర్తలను దూరం చేసుకోవడం ఆయన చేసిన తప్పని అన్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి మరీ జగన్ ఐ ప్యాక్ టీం ని నమ్ముకున్నారని.. అందువల్లే వైసీపీ ఈ స్థాయిలో ఘోర ఓటమి పాలయ్యిందని అన్నారు.

ఇదే క్రమంలో వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ ఓటమికి కారణం అని కొట్టు తెలిపారు. ఇదే సమయంలో... ఐప్యాక్ పనికిమాలిన సంస్థ అని, పనికిమాలిన చెత్తనంతా జగన్ పోషించారని, రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివినవారు తమ పబ్బం గడుపుకున్నారని, అందువల్లే అప్పట్లో ఆయనను కలవలేకపోయామని తెలిపారు. ఈ విధంగా ఓటమి అనంతరం వైసీపీ నేతలు తమ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.

Tags:    

Similar News