చంద్రబాబును జైల్లో పెట్టడానికి బీజేపీ సహకారం: రామకృష్ణ హాట్ కామెంట్స్
జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయడానికి బీజేపీ సహకరించిందని సీపీఐ రాష్ట్ర రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు
జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయడానికి బీజేపీ సహకరించిందని సీపీఐ రాష్ట్ర రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పొత్తుల కోసం బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కి దిగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీతో పొత్తులకు సంబంధించి బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు.. ఆదేశాలా? లేకా పొత్తుల కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అని నిలదీశారు.
సీఎం వైఎస్ జగన్ అరాచక పాలన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ పూర్తి సహకారం ఉందని ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబును జైలులో పెట్టించి ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బెదిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి పరీక్ష జరుగుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. బీజేపీ బెదిరింపులపై టీడీపీ స్పందించాలని సూచించారు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తామని వెల్లడించారు.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు లక్షల సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి రోడ్లెక్కారని రామకృష్ణ గుర్తు చేశారు. అయితే వారి సమస్యలు పట్టకుండా.. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను బదిలీ చేసే పనిలో ముఖ్యమంత్రి మునిగి తేలుతున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో పనికిరాని మంత్రి.. గుంటూరులో ఎలా పనికి వసుందో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడుగా పార్టీ పనులు చేసుకోవాలని జగన్ కు సూచించారు. అయితే జగన్ పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ చేయాలని రామకృష్ణ ఆశిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల తమను కలుపుకుని టీడీపీ, జనసేన పోటీ చేయాలని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రామకృష్ణ ఇప్పటికే సూచించారు.