కూటమితో కరచాలనం చేస్తున్న కామ్రేడ్స్

ఇపుడు సీపీఐ కూడా అదే విధంగా చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో పార్టీ నేతలు అంతా సీఎం చంద్రబాబుని కలసి ఆయనతో ముచ్చటించారు.

Update: 2024-08-01 03:53 GMT

ఏపీలో రాజకీయం అంతుపట్టకుండా ఉంటోంది. విపక్షంలో ఐక్యత లేదు. అధికారంలో ఉన్నా లేక విపక్షంలో ఉన్నా వైసీపీ ఒంటరిగానే మిగిలిపోతోంది. దానికి ఆ పార్టీ అధినాయకత్వం వైఖరి ముఖ్య కారణం అని అంటున్నారు. ఎవరితోనూ పొత్తులు లేవని బాహాటంగా చెప్పుకుంటుంది ఆ పార్టీ. అయితే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినపుడు విపక్షాలను కూడగట్టడంలో జగన్ ఎపుడూ ఆలోచనలు చేయలేదు.

ఆయన పంథా 2014 నుంచి 2019 దాకా అలాగే ఉంది. ఇక ఏపీలో కాంగ్రెస్ ఉంది. దానికి చీఫ్ గా జగన్ సోదరి ఉన్నారు. ఆమె అధికార పార్టీని కాకుండా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా విపక్షం ఉండడం అధికార కూటమికి లాభమే. దానికి తోడు కామ్రేడ్స్ ఏపీలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు.

ప్రభుత్వానికి మంచి విషయాలలో సలహా సూచనలు ఇస్తూ తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపుతున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వానికి ఒక నిజమైన విపక్షం గా బయట నుంచి ఉంటూ సహకరిస్తున్నారు. ఇటీవల చంద్రబాబును ముఖ్యమంత్రి అయిన తరువాత కలిసింది సీపీఎం. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఇతర సీపీఎం నేతలు ముఖ్యమంత్రిని కలసి సమస్యల మీద ఆయనకు వినతి పత్రాన్ని ఇచ్చారు.

అదే సమయంలో సామాజిక పెన్షన్లను నాలుగు వేలకు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి స్వాగతించారు. ఇలా సీపీఎం నేతలు స్నేహపూర్వక వైఖరితోనే కూటమితో వ్యవహరిస్తూ అవసరమైన సందర్భాలలో విమర్శలు చేయాలని చూస్తున్నారు.

ఇపుడు సీపీఐ కూడా అదే విధంగా చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో పార్టీ నేతలు అంతా సీఎం చంద్రబాబుని కలసి ఆయనతో ముచ్చటించారు. పోలవరం ప్రాజెక్టుని సత్వరం పూర్తి చేయాలని దానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చుకోవాలని వారు సీఎం కి సూచించారు. అలాగే విశాఖ రైల్వే జోన్ ని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విధంగా చూసినపుడు ఉభయ వామపక్షాలూ టీడీపీ కూటమికి రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరించాలని నిర్ణయించుకున్నట్లుగా అర్ధం అవుతోంది. అదే సమయంలో నిర్మాణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగాలని అనుకుంటున్నారు

ఒక విధంగా చూస్తే ఇది చంద్రబాబుకు ఊరటను ఇచ్చే అంశం. కూటమిలో జనసేన బీజేపీ ఎటూ మిత్రులుగా ఉన్నాయి. వామపక్షాలు కూడా ఘర్షణాత్మక మైన వైఖరితో ముందుకు వెళ్లే సూచనలు లేవు. కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో వైసీపీనే ఎటాక్ చేస్తోంది. వైసీపీ ఒక్కటే ఒంటరిగా ఉంది. దాంతో ఏపీలో కూటమికి రాజకీయంగా వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News