ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు... తెరపైకి హనీ ట్రాప్!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2014లో హనీట్రాప్ కేసులో తనను ప్లాన్ చేసి, అన్యాయంగా ఇరికించి ఉద్యోగం తొలగించారంటూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.
అవును... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు తనను 2014లో ఓ హనీ ట్రాప్ కేసులో ఇరికించారని, ఫలితంగా ఐఐఎస్సీ ఫ్యాకల్టీ విధుల నుంచి తొలగించారని ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో ఆయన... తాను కులపరమైన దూషణలతో పాటు బెదిరింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 2014లో గోపాలకృష్ణన్, బలరాం మొదలైనవారు హనీ ట్రాప్ చేసి, తప్పుడు కేసులో ఇరికించారని, వీరికి మరికొంతమంది ఇతర ఫ్యాకల్టీ సభ్యులు సహకరించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై క్రిస్ గోపాలక్రిష్ణన్ నుంచి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో.. ఈ ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్.. 2011 నుంచి 2014 వరకూ ఆ సంస్థ వైఎస్ ఛైర్మన్ గా పనిచేశారు. అంతకంటే ముందు 2007 నుంచి 2011 వరకూ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ పనిచేశారు. ఇదే క్రమంలో... 2013-14 సంవత్సరానికి సీఐఐ అధ్యక్షుడిగానూ ఎన్నికయారు.