ఐఐటీ మద్రాస్ కు రూ.228కోట్లు ఇచ్చిన తెలుగోడు ఏమన్నారంటే?
తాను ఆనందంగా ఉండాలని.. తద్వారా తన ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతోనే తాను రూ.228 కోట్ల విరాళాన్ని ఇస్తున్నానే తప్పించి.. తానేమీ ఆశించటం లేదన్నారు.
ఏపీలోని బాపట్ల పట్టణానికి చెందిన ప్రవాసాంధ్రుడు క్రిష్ణ చివుకుల ఒక్కసారిగా వార్తల్లోకి రావటం.. ఫేమస్ కావటం తెలిసిందే. దీనికి కారణం.. ఆయన ఐఐటీ మద్రాస్ కు రూ.228 కోట్ల భారీ భూరి విరాళాన్ని ప్రకటించటమే. మన దేశంలోని ఏ విశ్వవిద్యాలయానికి కూడా ఇంత భారీ మొత్తంలో ఒకేసారి విరాళం వచ్చింది లేదు. ఇలాంటి వేళ.. ఇంత భారీ మొత్తాన్ని ఐఐటీ మద్రాస్ కు ఎందుకు ఇస్తున్నట్లు? అన్న ప్రశ్నను క్రిష్ణా చివుకుల ఎదుర్కొంటున్నారు. తాజాగా చెన్నైకు వచ్చిన ఆయన.. ఐఐటీ మద్రాస్ కు తాను ఇవ్వాలనుకున్న భారీ భూరి విరాళాన్ని ఇచ్చేశారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాను ఆనందంగా ఉండాలని.. తద్వారా తన ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతోనే తాను రూ.228 కోట్ల విరాళాన్ని ఇస్తున్నానే తప్పించి.. తానేమీ ఆశించటం లేదన్నారు. ఇండో మిమ్ సంస్థ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. మంగళవారం అమెరికా నుంచి చెన్నైకు వచ్చారు. అమెరికాలో 55 ఏళ్లుగా ఉంటున్నానని.. అక్కడి విశ్వవిద్యాలయాలకు సంపన్నులు విరివిగా విరాళాలు ఇస్తుంటారని.. సమాజంలో విద్య.. ఆరోగ్యాన్ని పెంచేందుకు.. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పారు.
"నా దేశానికి సేవ చేయాలని నాకూ ఎన్నో ఏళ్లుగా మనసులో బలంగా అనిపిస్తోంది. అమెరికా వాళ్లు సైతం ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చే ఇంజినీర్లను చూసి ఆశ్చర్యపోవటం చూస్తుంటాను. నేను ఇక్కడే చదువుకున్నాను. అందుకే నా దానాల్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనుకున్నా. ఈ నిధులతో ఐఐటీ మద్రాస్ లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయి. క్రీడాకారులకు ప్రోత్సహం దక్కుతుంది. క్యాంపస్ నుంచి విడుదలయ్యే మ్యాగజైన్ లకు నిధులు లభిస్తాయి"అని చెప్పారు.
తాను ఇచ్చిన భారీ విరాళంతో పాతికేళ్ల పాటు క్యాంపస్ లోని ఐదు కేటగిరీల్లో నిధులకు సంబంధించి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఏపీలోని తిరుపతిలో గతంలో పరిశ్రమల్నిఏర్పాటు చేశామని.. వాటిని మరింత విస్తరిస్తామన్నారు. క్రిష్ణ చివుకుల సేవలకు గుర్తింపుగా ఐఐటీ మద్రాస్ లోని ఒక అకడమిక్ బ్లాక్ కు అధికారులు ఆయన పేరును పెట్టటం గమనార్హం..