ఎంపీ పదవితో పాటు జగన్ మీద ఆర్ క్రిష్ణయ్య సంచలనం

ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉండగా ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-09-29 12:49 GMT

ఆర్ క్రిష్ణయ్య బీసీల నేత. ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో కూడా ఆయన మార్క్ చూపించుకున్నారు. ఆయన పోరాటం చేసి బీసీల హక్కు కోసం పాటుపడ్డారు. అలాంటి ఆర్ క్రిష్ణయ్య సేవలను గుర్తించి జగన్ ఆయనను కోరి మరీ రాజ్యసభకు ఎంపిక చేశారు. 2022లో ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉండగా ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే క్రిష్ణయ్య తన పట్ల ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ పదవి ఇస్తే దానిని వదులుకుని వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీని మీద ఒక వెబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో క్రిష్ణయ్య మాట్లాడారు. తన దృష్టిలో ఎంపీ పదవి అన్నది చాలా చిన్నది అని అన్నారు. తనది యాభై ఏళ్ల బీసీల పోరాటం అని ఆయన గుర్తు చేశారు.

బీసీల హక్కుల కోసం పారాడుతూ వారికి ఎన్నో అవకాశాలను తెచ్చినపుడు తనకు ఏ పదవి ఉందని ఆయన ప్రశ్నించారు. తన వెంట పార్లమెంట్ లో ఎవరూ లేరని ఒక్కడినే కూర్చుని జీరో అవర్ లో ప్రశ్నలు వేసినా సరైన ప్రయోజనం లేదని ఈ నేపథ్యంలో ఆ పదవి ఎందుకు అనిపించి రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజ్యసభలో ఉండడం వల్ల నష్టమే ఎక్కువ ఉందని, బీసీ ఉద్యమమే ఆగిపోయింది అన్నారు.

తాను బయట ఉంటే తన జాతికి న్యాయం చేయడం సాధ్యమని భావించే పదవిని వదులుకున్నాను అన్నారు. తాను సామాజిక ఉద్యమకారుడిని అని తనకు పదవులతో పని లేదని ఆయన చెప్పారు. అందుకే తృణప్రాయంగా వదులుకున్నాను అన్నారు

అదే వేరొకరు అయితే అసలు వదులుకోరని అన్నారు. ఇదిలా ఉంటే తనకు జగన్ మీద ఈ రోజుకీ అదే అభిమానం ఉందని అన్నారు. బీసీల కోసం జగన్ ఎంతో చేశారు అని అన్నారు ఆయన ఎన్నో పధకాలను కూడా ప్రవేశపెట్టారని కూడా కొనియాడారు. తాను జగన్ కి నష్టం చేయాలని కూడా అనుకోలేదని తన విధానాలు తన నిర్ణయాల కోసమే ఇలా చేశాను అని ఆయన స్పష్టం చేశారు.

ఇక తాను వదిలేసిన తరువాత ఎంపీ పదవి టీడీపీకి పోయినా మరో పార్టీకి పోయినా తనకేంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ పక్కన పెడితే క్రిష్ణయ్య ఎంపీ పదవి చిన్నది అంటున్నారు. మరి తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని అంటున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది

పెద్ద పదవి అంటే సీఎం పదవా అన్న మాట కూడా ఉంది. క్రిష్ణయ్య బీసీలను అందరినీ ఒక్కటిగా చేసి పార్టీ పెట్టి రేపటి రోజున రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారా అన్న చర్చ కూడా వస్తోంది. అందుకే ఆయన రాజ్యసభ వదిలేశారా అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన బీజేపీలో చేరుతారని కూడా అంటున్నారు. ఆయన బీజేపీలో చేరితే కచ్చితంగా ఆయన పేరుని సీఎం పదవికి పరిశీలిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా క్రిష్ణయ్య పెద్ద పదవికే గురి పెట్టి చిన్న పదవి అయిన ఎంపీని వదిలేశారా అన్నది మరో డౌట్. ఏది ఏమైనా క్రిష్ణయ్య నిర్ణయం టీడీపీకి ఆయాచిత వరం అయింది.

ఏపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఆ పదవులలో టీడీపీ తన వారికి చాన్స్ ఇస్తుంది. అదే సమయంలో వారికి కూడా ఎక్కడో అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. కానీ క్రిష్ణయ్యకు అలాంటిది ఇవ్వాల్సింది లేదు. ఆయనే స్వచ్చందంగా పదవిని వదులుకున్నాను అని చెబుతున్నారు. దాంతో టీడీపీకి కోరి మరీ నాలుగేళ్ళ ఎంపీ పదవి దక్కుతోందని అని అంటున్నారు.

Tags:    

Similar News