ఉచితాలకు టీడీపీ కూటమి మంగళం పాడుతుందా ?

మరో వైపు చూస్తే గత వైసీపీ ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేసింది అని కూటమి పెద్దలు అంటున్నారు.

Update: 2024-08-21 13:40 GMT

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు అయింది సూపర్ సిక్స్ ఊసు అయితే లేదు. అందులో చెప్పినది ఏ ఒక్కటీ అమలు దిశగా అడుగులు పడలేదు. త్వరలో అంటూ మంత్రులు ఇతర పెద్దలు చెబుతూ వస్తున్నారు. మరో వైపు చూస్తే గత వైసీపీ ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేసింది అని కూటమి పెద్దలు అంటున్నారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని చెబుతున్నారు.

ఇవన్నీ జనాలకు ఎంతవరకూ పడతాయో తెలియదు కానీ సూపర్ సిక్స్ మీద మాత్రం కూటమి చెప్పడం లేదు అన్న బాధ వెలితి అయితే నిండుగా జనంలో ఉంది. జూన్ 12న ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ఆరంభం అయింది. ఇప్పటికి రెండున్నర నెలలు గడిచింది. మరో నెల గడిస్తే క్వార్టర్లీ పరీక్షలు వచ్చేస్తాయి. ఇప్పటికి తల్లికి వందనం అన్న పథకం గురించి అయిపూ అజా లేదని అంటున్నారు.

ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని చెప్పారు. కానీ ఇపుడు ఆ పధకం ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఇది భారీ బడ్జెట్ హామీ కాబట్టే వెనక్కి పెట్టారు అని అంటున్నారు. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చ్చినప్పటికే మూడు రెండున్నర నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిపోయాయి.

మిగిలిన నెలలలో అయినా ఈ పధకం అమలు అవుతుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు. అయితే ఈ పథకం విషయంలోనూ ఏమీ చెప్పడం లేదు. అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు అని కూడా చెప్పారు.

ప్రతీ రైతుకూ ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అన్నారు. బంగారం లాంటి ఖరీఫ్ సీజన్ ప్రస్తుతం సాగుతోంది. ఏపీలో ఖరీఫ్ సీజన్ లోనే ఎక్కువ పంట పడుతుంది. రైతులకు కూడా పెట్టుబడి సాయం అవసరం అవుతుంది. కానీ రైతులకు ఆ ఆర్థిక సాయం అయితే ఇప్పటిదాకా అందలేదు అని అంటున్నారు.

ఇక అన్నింటికన్నా ముఖ్య హామీ అన్నది ఒకటి ఉంది. యువతకు ఉపాధి లభించే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ ఇచ్చిన అచ్చమైన ఆరవ హామీ. ఈ హామీ గురించి ఎవరూ అసలు మాట్లాడటం లేదు.

ఇలా సూపర్ సిక్స్ హామీలు అన్నీ గాలిలోనే ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వం ఎపుడు అమలు చేస్తుంది అన్నది పక్కన పెడితే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని ప్రభుత్వ పెద్దలు ఒక వైపు చెబుతూ వస్తున్నారు. మరో వైపు చూస్తే ఆ పార్టీ నేతలు కూడా ఉచితాలు వద్దు అని మాట్లాడుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఉచితాలు దండుగ అని బోల్డ్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రజలకు నేరుగా నగదు వారి ఖాతాలో వేస్తే ఇళ్లలో వంటలు మానేసి బిర్యానీలు తింటున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. ఉచితాల వల్ల ప్రభుత్వ ధనం వృధా తప్ప మరేమీ లేదని అన్నారు. అందువల్ల చంద్రబాబుకు తాను ఇదే విషయం చెప్పానని అన్నారు.

ఉచితాల బదులుగా వారికి ఉపాధికి పనికి వచ్చే పరికరాలు ఉపకరణాలు ఇస్తే బాగుంటుంది అని ఆయన సూచన చేశారు. మొత్తం మీద చూస్తే రాజు గారు చేసిన ఈ వ్యాఖ్యలు మంట రేపుతున్నాయి. వైసీపీ అయితే దీనిని వైరల్ చేస్తోంది. ఉచితాలకు కూటమి మంగళం పాడడానికే ఇలా అనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక సాదా జనంలో చూసుకుంటే ఉచితాలకు అనుకూలంగా ఉన్న వారు అట్టడుగు వర్గీయులు ఉన్నారు. అయితే మధ్యతరగతి ఉన్నత వర్గాల వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఉచితాలు దండుగ అన్నది వారి భావన. అయితే ఉచితాలు దండుగ అవునా కాదా అన్నది ఇపుడు పెట్టాల్సిన డిబేట్ కాదని కూటమి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిందని వైసీపీ కంటే రెట్టింపు పధకాలు ఇస్తామని చెప్పడం వల్లనే జనాలు టర్న్ అయ్యారని అంటున్నారు.

ప్రజల ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలి కదా అని అంటున్నారు. చంద్రబాబు వంటి అనుభవం కలిగిన నేతకు ఉచితాలు ఎంతటి భారమో తెలియదా అలాగే ఖజానాలో నిధులు లేవన్న సంగతి తెలియదా అని కూడా అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన విశ్వసనీయత నిరూపించుకోవాలని డిమాండ్లు కూడా ఉన్నాయి.

చోడవరం ఎమ్మెల్యే రాజు ఇపుడు తాపీగా నగదు బదిలీ పధకం దండుగ అని అంటున్నారని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రజల మైండ్ సెట్ మెల్లగా డైవర్ట్ చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోందనడానికే టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు