కేటీఆర్ రాజేసిన కాక.. బీజేపీలో ఉలికిపాటు
కంచ గచ్చిబౌలి భూ వివాదంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు బీజేపీని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు;

కంచ గచ్చిబౌలి భూ వివాదంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు బీజేపీని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. రూ.10 వేల కోట్ల స్కాం జరిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీ సహకరించారని రెండు రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బహిర్గత పరచకపోవడంపై చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్న బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలంటూ కమలం నేతలు సవాల్ విసురుతున్నారు. అయితే సమయం వచ్చినప్పుడు ఆ పేరు బయటపెడతానంటూ కేటీఆర్ తప్పించుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బురద పూస్తే తాము కడుగు కోవాల్సివస్తోందని కమలం నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ కు దమ్ముంటే బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ సౌండ్ చేయడం లేదు. దీంతో వ్యూహాత్మకంగానే కేటీఆర్ బీజేపీని ఇరుకన పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండగా, వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన ఆరుగురిలో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురం అర్వింద్, జి.నగేశ్ ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీల్లో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సైలెంటుగా వ్యవహరిస్తుంటారు. తన పనేదో తాను చేసుకుంటారు. కానీ, మిగిలిన ఐదుగురు ఎంపీలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఐదుగురు ఒకరిని మించి మరొకరు రాజకీయంగా పావులు కదుపుతుంటారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి సహరించిన వారు ఈ ఐదుగురులో ఒకరి అయి ఉంటారని చర్చ జరుగుతోంది. అయితే రాజకీయ వర్గాలు మాత్రం కేటీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఇరుకున పెట్టేందుకే బీజేపీ ఎంపీ ఉన్నారంటూ గుడ్డ కాల్చి ముఖాన వేశారంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీకి మధ్య స్నేహ బంధం ఉందని కాంగ్రెస్ ప్రచారం చేసి లబ్ధి పొందింది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ చూస్తోందని అంటున్నారు. నిజంగా రేవంత్, బీజేపీ ఎంపీ మధ్య లింకు ఉంటే ఆ పేరు అప్పుడే బయటపెట్టేవారు కదా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న బీజేపీ ఎంపీ సమాచారం తమ వద్ద పక్కాగా ఉందని, సమయం వచ్చినప్పుడు బయటపెడతామని బీఆర్ఎస్ ఢంకా భజాయించి మరీ చెబుతోంది. దీంతో కేటీఆర్ రేపిన కాక బీజేపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బీజేపీ ఎలాంటి ప్రతివ్యూహం పన్నుతుందనేది ఆసక్తి రేపుతోంది.