కేసీఆర్ @ 72.. నా హీరో.. తెలంగాణకూ.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్
తెలంగాణ అనే దశాబ్దాల కలను సాకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు 72వ ఏట అడుగుపెట్టారు.
తెలంగాణ అనే దశాబ్దాల కలను సాకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు 72వ ఏట అడుగుపెట్టారు. 1954 ఫిబ్రవరి 17న పుట్టిన కేసీఆర్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1970ల చివర్లో స్వగ్రామం చింతమండక సొసైటీ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన దాకా అలుపెరగకుండా సాగింది. ఆపై ముఖ్యమంత్రిగా దాదాపు పదేళ్లు దిగ్విజయంగా నడిచింది. వరుసగా రెండుసార్లు విజయం సాధించాక మూడోసారీ గెలుపుపై విశ్వాసం కనబర్చినా ఆశలు నెరవేరలేదు.
ప్రతిపక్ష నేతగా తగినంత బలం సాధించిన కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కసారే హాజరయ్యారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక అధికారం కోల్పోయాక జరుపుకొంటున్న రెండో పుట్టిన రోజున కేసీఆర్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఉంటున్న బీఆర్ఎస్ అధినేతను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.
తన తండ్రి, రాజకీయ మార్గదర్శి కేసీఆర్ కు ఆయన జన్మదినంగా సందర్భంగా కుమారుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నాన్న.. నువ్వే నా హీరో.. తెలంగాణకు కూడా’ అంటూ కొనియాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతి తండ్రి తమ బిడ్డకు హీరో అని వారు చెబుతారు, మా నాన్న నా ఒక్కడికే కాదు, తెలంగాణ హీరో అయినందుకు నేను ధన్యుడిని’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. “తెలంగాణ అనే కలను ప్రేమించి, పోరాడి, వ్యక్తిగత జీవితం వదులుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. మీరు సాధించిన దాంట్లో కనీసం కొంతైనా సాధించాలనేది తన ఏకైక కల అని.. మీరు మీ కొడుకు అని గర్వంగా పిలుచుకునే వ్యక్తిగా ఉండటమే తన ఏకైక లక్ష్యం అని కేటీఆర్ భావోద్వేంగ పోస్ట్ పెట్టారు.