రేవంత్‌రెడ్డి యాక్సిడెంటల్ సీఎం: కేటీఆర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి యాక్సిడెంటల్‌గా ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేంత చరిష్మా లేదని విమర్శించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తాజాగా ప్రభుత్వం విడుదల చేసి న గణాంకాలను వివరిస్తూ.. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సంపద సృష్టికి కేంద్రంగా మారిందని తెలిపారు. కానీ, ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు.
తమ హయాంలో అభివృద్ది జరగలేదని.. దివాలా తీసే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, వాస్తవానికి కేంద్రం ఇచ్చిన నివేదికలోనే సంపద పెరిగినట్టుగా ఉందని పేర్కొంటూ.. సంబంధిత గణాంకాలను ఆయన మీడియాకు వివరించారు. ``కాళేశ్వరంపై కొంతమంది సన్నాసులు చెత్తవాగుడు బంద్ చేయాలి`` అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థికస్థితిపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన నివేదికే తమ పాలనకు అద్దం పడుతుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి అనుకోకుండా.. యాక్సిడెంటల్‌గా ముఖ్యమంత్రి అయ్యారన్న కేటీఆర్.. ``సిగ్గు.. మానం లేని మూర్ఖపు ముఖ్యమంత్రి`` అని తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. కేసీఆర్‌ను పదే పదే అవమానిస్తున్నారని.. విమర్శలు చేస్తున్నారని.. వీటిని మానుకోవాలని హితవు పలికారు. వాస్తవాలు వెల్లడించిన భట్టి విక్రమార్కను మంత్రి వర్గం నుంచి తొలగించినా తొలగించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయకుండానే.. అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రాతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని.. నిర్మాణ రంగం పూర్తిగా నాశనం అయిపోయిందని .. రియల్టర్లు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రైతులు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేక పోతే.. క్రాప్ హాలిడే ప్రకటించాలని వ్యాఖ్యానించారు.