ఫార్ములా ఈ కారు రేస్ బాగా బిగుసుకుంటుందా?

అయితే.. ఈ వ్యవహారం లోతుల్లోకి వెళితే.. కొత్త విషయాలు వెలుగు చూడటమే కాదు.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఇబ్బందులు ఎక్కువ అయ్యేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది

Update: 2025-01-03 06:49 GMT

మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు అయ్యేందుకు అవకాశం ఉందని భావిస్తున్న ఫార్ములా ఈ -కారు రేసింగ్ కు సంబంధించి ఇప్పటివరకు వెలుగు చూసిన వాదనకు భిన్నమైన వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో విషయం ఏమీ లేదని.. అంతా తూచ్ అనేలా అవుతుందన్నట్లుగా చాలా తేలిగ్గా తీసి పారేస్తున్నారు కేటీఆర్. అయితే.. ఈ వ్యవహారం లోతుల్లోకి వెళితే.. కొత్త విషయాలు వెలుగు చూడటమే కాదు.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఇబ్బందులు ఎక్కువ అయ్యేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వాదనలోని అంశాల్ని చూస్తే..

- సివిల్ పనులు నిర్వహణే చేయాల్సిన ప్రభుత్వం అంతకు మించి అన్నట్లు ఎందుకు వెళ్లింది?

- ఎఫ్ఈవోకు చెల్లింపులు చేయాల్సిన స్పాన్సరర్.. పక్కకు తప్పుకోవటం ఏమిటి?

- చెల్లింపులతో సంబంధం లేకున్నా.. ఆ బాధ్యతను కేసీఆర్ సర్కారుకు ఎందుకు తలకెత్తుకుంది?

- ఈ రేసుతో సంబంధం లేని హెచ్ఎండీఏ రూ.46 కోట్లను ఎందుకు చెల్లింపులు జరిపినట్లు?

- ఆర్థిక శాఖ.. మంత్రివర్గం ఆమోదం లేకుండానే డాలర్లతో చెల్లింపులు ఎందుకు చేసినట్లు?

- రేసింగ్ ఒప్పందానికి నాలుగు నెలల ముందే పుట్టిన కంపెనీతో ఒప్పందం ఏంటి?

- గ్రీన్ కో డైరెక్టర్ల ప్రమోటర్లు.. పెయిడప్ క్యాపిటల్ రూ.2 లక్షలే కావటం ఏమిటి?

- ఎగ్జిబిషన్ ప్రచారానికి సంబంధించి ఏ మాత్రం అనుభం లేని వ్యక్తితో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లు?

ఇలాంటి బోలెడెన్ని ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసును హైదరాబాద్ లో నాలుగు విడతల్లో నిర్వహించటానికి పురపాలక శాఖ (అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చేతుల్లోనే ఈ శాఖ ఉంది).. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీల్ ప్రకారం చూస్తే.. పురపాలక శాఖ పాత్ర చాలా పరిమితం. రేస్ ట్రాక్ నిర్మించటం.. ఇతర సివిల్ పనులు మాత్రమే పురపాలక వాఖ పని.

రేస్ ను నిర్వహించాల్సింది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్. ఈ వ్యవహారంలో తాను ప్రమోటర్ గా ఉంటానని.. అందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానంటూ ఏస్ నెక్ట్స్ జెన్ అనే సంస్థ ముందుకు వచ్చింది. రేస్ కమర్షియల్ యాక్టివిటీ మొత్తం తానే చూసుకుంటానని చెప్పింది. దీంతో.. ఈ మూడు పార్టీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రమోటర్ తప్పుకుంటే.. ఆ బాధ్యత ప్రభుత్వానిదని.. ఎఫ్ఈవోకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధన ఎక్కడా లేదు.

అయితే.. రెండో విడత రేస్ నిర్వహణ వేళ స్పాన్సరర్ (ఏస్ నెక్ట్స్ జెన్) తప్పుకుంది. దీంతో.. ప్రభుత్వం స్పాన్సరర్ పాత్రలోకి వెళ్లటమే ఈ కేసు మొత్తంలో కీలకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ కూడా ఈ అంశం మీదే ఉంది. తనకు సంబంధం లేని స్పాన్సరర్ గా ప్రభుత్వం ఎందుకు మారింది? అసలు ఈ కంపెనీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. కేవలం రూ.2 లక్షల మూలధనంతో కంపెనీ ఏర్పాటైంది. ఇక్కడే మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఈ డీల్ కుదుర్చుకోవటానికి నాలుగు నెలల ముందే ఈ కంపెనీని ఏర్పాటు చేవారు. అది కూడా గ్రీన్ కోలో డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగత హోదాలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు.

కంపెనీ డైరెక్టర్లుగా అనిల్ కుమార్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఉన్నారు. వీరిద్దరూ దేశంలోనే అతి పెద్ద ఎనర్జీ సంస్థ అయిన గ్రీన్ కోలో డైరెక్టర్లుగా ఉన్నారు. నిజానికి గ్రీన్ కో సంస్థకు.. నెక్ట్స్ జెన్ కు.. ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదు. తమకు తెలియని స్పోర్టింగ్.. రిక్రియేషన్ కంపెనీని అనిల్.. మహేశ్ లు ఎందుకు స్టార్ట్ చేశారు? కేవలం స్పాన్సరర్ అవతారం ఎత్తటానికే కంపెనీని ఏర్పాటు చేశారా? తెర వెనుకేం జరిగింది? లాంటివి ఇప్పుడు సమాధానాలు రావాల్సిన ప్రశ్నలు.

ఇక.. కేటీఆర్ పాత్రకు వస్తే.. పదో సెషన్ నిర్వహణకు ఎఫ్ఈవోకు 90 లక్షల పౌండ్లు చెల్లించటానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైల్ మీద కేటీఆర్ సంతకం చేశారు. దీంతో స్పాన్సరర్ బాధ్యతను కూడా పురపాలక శాఖ తలకెత్తుకుంది. ఇందుకు ఎఫ్ఈవోకు పన్నులతో కలిపి రూ.56 కోట్లు చెల్లించారు. ఇక్కడే మరో రెండు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. చెల్లింపులకు సంబంధించి మంత్రివర్గ ఆమోదంతో పాటు.. పురపాలక శాఖ చెల్లింపులు జరపాలి. కానీ.. దాంతో సంబంధం లేని హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎందుకు చెల్లింపులు జరిపారు? అన్నది మరో ప్రశ్న. అంతేకాదు.. డాలర్లలో ఒక విదేశీ సంస్థకు చెల్లింపులు చేస్తే.. అందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ.. అలాంటి అనుమతులు తీసుకోకపోవటం మరో అంశంగా చెబుతున్నారు.

Tags:    

Similar News