పండుగపూట పంచాయితీ: కేటీఆర్.. హరీశ్ ల హౌస్ అరెస్టు

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్రనేతల ఇళ్ల వద్ద భారీగా బందోబస్తును మొహరించారు. హౌస్ అరెస్టు చేసి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.

Update: 2025-01-14 05:05 GMT

ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ వార్తల్లో దర్శనమిచ్చే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. పోలీసుల తీరును తప్పు పడుతూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రెస్ నోట్ల ద్వారా తమ ఖండనల్ని గులాబీ అగ్రనేతలు కేటీఆర్.. హరీశ్ రావులు తెలియజేశారు. మరోవైపు.. తన నిరసనను తెలియజేసేందుకు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయాలన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. దీన్ని నిలువరించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్రనేతల ఇళ్ల వద్ద భారీగా బందోబస్తును మొహరించారు. హౌస్ అరెస్టు చేసి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ తీరుపై కేటీఆర్.. హరీశ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ తరఫు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే.. సంజయ్ మాత్రం పార్టీ మారుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ తీరును తప్పు పడుతూ కౌశిక్ రెడ్డి ఆయన పట్ల దురుసుగా వ్యవహరించటం.. వెనక్కు నెట్టటం లాంటివి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సమావేశ హాల్ నుంచి బయటకు పంపారు. సంజయ్ ఏ పార్టీనో తేల్చి చెప్పాలని ప్రశ్నించటంతో వివాదం షురూ అయ్యింది.

ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు టీవీ న్యూస్ చానల్ వద్ద కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్థరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేపట్టాలని.. ప్రభుత్వ వైఖరిని ఖండించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదంతా చూసినప్పుడు పండగ పూట ఈ పంచాయితీ ఏంది సామి అనుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News