లాయర్‌ను తెచ్చుకుంటే తప్పేంటి..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి.

Update: 2025-01-08 09:41 GMT

తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసి హైకోర్టు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే.. తాజా మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌కు కాస్త ఉపశమనం లభించింది. విచారణకు తనవెంట లాయర్‌ను అనుమతించిన కోరిన విజ్ఞప్తిపై కీలక తీర్పునిచ్చింది.కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం అయింది. విచారణ సందర్భంగా.. కేటీఆర్‌తో న్యాయవాదిని అనుమతించాలని అడ్వకేట్ ప్రభాకర్ రావు వాదించారు.

గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందని ప్రభాకర్ రావు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డిజేబుల్ డిస్టెన్స్‌లో ఉండేలా అనుమతి ఇవ్వాలని కోరారు.

ఇదే కేసుపై ఏసీబీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించవద్దని వాదించారు. అయితే.. న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు.

చివరకు.. ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ లాయ‌ర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అంగీకరించింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయ‌వాదుల పేర్లను సూచించాల‌ని కోర్టు సూచించింది. ముగ్గురిలో ఒక‌రిని మాత్రమే కేటీఆర్ తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిందితుడు, అధికారి ఒక గదిలో ఉంటే.. వాళ్లు కనిపించే దూరంలో న్యాయవాది మరో గదిలో ఉంటారని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పిటిషనర్ కనిపించేలా ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు ఉన్నాయా అని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.

Tags:    

Similar News