త్వరలో భారీ కుంభకోణం: రేవంత్-బీజేపీపై కేటీఆర్ బిగ్ బాంబ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకత్వం కాపాడుతోందని ఆయన ఆరోపించారు.;

Update: 2025-04-08 09:45 GMT
Ktr Sensational Comments in land Scam

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. త్వరలోనే ఒక భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని ఆయన ప్రకటించారు. ఈ కుంభకోణం కేవలం 400 ఎకరాలకు పరిమితం కాదని, దీని వెనుక వేల కోట్ల రూపాయల వ్యవహారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ కుంభకోణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఒక ఎంపీ కూడా ఉన్నారని ఆరోపించారు. పేర్లు వెల్లడించకుండానే ఆయన విమర్శలు గుప్పించారు. ఒకరు ఢిల్లీలోని పెద్ద నేతల చెప్పులు మోస్తుంటే, మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రెండు జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ యొక్క జుట్టు కూడా ఢిల్లీలోని నాయకుల చేతుల్లోనే ఉందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకత్వం కాపాడుతోందని ఆయన ఆరోపించారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నాయని అన్నారు. రాజకీయ బాంబులు పేలకపోవడంతోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యారని, అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి కూడా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.

రేవంత్, రాహుల్ (ఆర్ఆర్) ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో పోటీ చేసేందుకు తమకు తగిన సంఖ్య లేదని, అందుకే దూరంగా ఉంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు అంత ఆందోళన ఎందుకని ఆయన నిలదీశారు.

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంలా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే హెచ్‌సీయూ భూముల అమ్మకం ఆపగలదని ఆయన అన్నారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణకు నష్టమని ఆయన విమర్శించారు. వరంగల్ సభ ద్వారా ఇదే సందేశాన్ని కేసీఆర్ ప్రజలకు ఇవ్వబోతున్నారని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో సన్న బియ్యం ప్రవేశపెట్టింది కేసీఆరేనని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.

నీటి కేటాయింపుల విషయంలో ఏపీ తరపున వాదించిన ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ అడ్వజైర్‌గా నియమించడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పడం వల్లే ఆదిత్యానాథ్ దాస్‌ను నియమించారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సరికాదని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాలను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై ఉన్న ద్వేషంతో కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెడుతోందని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ ఎప్పుడు కూలుతుందా అని కాంగ్రెస్ ఎదురు చూస్తోందని ఆయన విమర్శించారు.

వరంగల్‌లో 1200 ఎకరాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని, ఈ ఏడాది పార్టీ నేతలకు పండుగలా ఉంటుందని ఆయన అన్నారు. వరంగల్ సభకు అనుమతి కోసం పోలీసులను అడిగామని, డీజీపీతో మాట్లాడామని తెలిపారు. మూడు వేల బస్సుల కోసం ఆర్టీసీని కోరామని చెప్పారు. ఆదివారం సభ కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల నేతలతో చర్చించారని, ఒక్కో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్దేశం చేశారని కేటీఆర్ తెలిపారు. వరంగల్ సభ తమ పార్టీ చరిత్రలో అతిపెద్ద సమావేశం అవుతుందని ఆయన అన్నారు. మే నెలలో డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని, 2025 అక్టోబర్‌లో అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆయన వెల్లడించారు. మే నుంచి అక్టోబర్ వరకు పార్టీ సభ్యత్వం, కమిటీలపై దృష్టి పెడతామని, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన త్వరలోనే ఏ కుంభకోణాన్ని బయటపెడతారో, అందులో ఎవరెవరు ఉన్నారో అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News