బీఆర్ఎస్ నేత అరెస్ట్.. కేటీఆర్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున వెస్ట్‌మారేడుపల్లిలోని శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ నేతలకు పోలీసుల నుంచి వరుసగా నోటీసులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అరెస్ట్ అయి జైలు వరకు కూడా వెళ్లి వచ్చారు. తాజాగా.. మరో బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున వెస్ట్‌మారేడుపల్లిలోని శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం విచారణకు రావాల్సిందిగా కౌశిక్‌కు పోలీసులు నోటీసులు జారీచేయగా.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయితే.. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అనంతరం నోటీసులు ఇచ్చి.. వెంటనే అరెస్ట్ చేశారు. మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు.
కాగా.. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై ఆయన అరెస్టుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై కక్ష గట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఏమో కానీ.. ఏడో గ్యారంటీగా రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ని ముఖ్యమంత్రి రేవంత్ అమలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధాలు, అణచివేతలతో గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయని.. వాటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కేటీఆర్ విమర్శించారు. వాటిని వదిలేసి ప్రధాన ప్రతిపక్ష గొంతు ఎలా నొక్కాలనే దానిపైనే ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో తమను భయపెట్టలేరని పేర్కొన్నారు. ఇలాంటి విష సంస్కృతికి చరమగీతం పాడాలని, బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని, అరెస్టులు అంతకన్నా కొత్త కాదని తెలిపారు.