అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్.. హైదరాబాద్ ప్రజలపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ ఫ్యూచర్ ఏంటని చాలా వరకు హైదరాబాద్‌లోని ఆంధ్రా జనంలో ఇన్ సెక్యూర్ ఫీల్ ఉండేది.

Update: 2024-09-14 09:15 GMT

తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు ఉద్యమం కొనసాగింది. మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్ నెత్తిన వేసుకోగా.. ఆయన హయాంలోనే ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. అయితే.. ఉద్యమం వేళ కేసీఆర్ నిత్యం ఆంధ్ర నాయకులపై మండిపడేవారు. ఆంధ్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ సభలు, సమావేశాల్లో చెబుతుండేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మన రాష్ట్రం మనదే.. మన ఉద్యోగాలు మనవేనంటూ ఎన్నో సందర్భాల్లో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దాంతో కేసీఆర్ వ్యాఖ్యలతో చాలా వరకు ఆంధ్ర జనం ఆ సమయంలో వణికిపోయారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ ఫ్యూచర్ ఏంటని చాలా వరకు హైదరాబాద్‌లోని ఆంధ్రా జనంలో ఇన్ సెక్యూర్ ఫీల్ ఉండేది. అలా అని ఎప్పుడు కూడా ఆంధ్రా ప్రజలపై దాడులు కానీ, వారిని అడ్డుకోవడం కానీ చేయలేదు. దాంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎప్పటిలాగే పనులు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయినప్పటికీ వారి పట్ల పెద్దగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. దాంతో ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

అయితే.. గత మూడు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. అదే పార్టీకి చెందిన శేరిలింగంపల్లికి చెందిన అరికెపూడి గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన మాటలతో మరోసారి తెలంగాణ-ఆంధ్రా వాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. కౌశిక్ వ్యాఖ్యలపై ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతున్నా.. ఆయన వ్యాఖ్యలను సమర్థించే వారి కంటే విమర్శిస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్స్ అండగా నిలిచిన విషయాన్ని కౌశిక్ మరిచిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని మండిపడుతున్నారు.

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్.. వచ్చీరాగానే వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆయనను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడారు. అయితే.. ఆయన మాటల్లో కౌశిక్ వ్యాఖ్యలకు దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. కౌశిక్ వ్యాఖ్యలను ఆయన సున్నితంగా పక్కదారి పట్టించారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా తమ వాళ్లే అని చెప్పుకొచ్చారు. ప్రాంతీయత పేరిట తాము ఏనాడూ దాడులకు పాల్పడలేదని.. ఉద్యమం సమయంలోనూ అలాంటి చర్యలకు దిగలేదని.. భవిష్యత్తులోనూ ఉండబోవని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలు తమను కడుపునిండా పెట్టుకొని ఆశీర్వదించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని అన్నారు. అందుకే ఇప్పుడు ఇలా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అలాగే.. అరికెపూడి గాంధీ తీరుపైనా ఆయన స్పందించారు. పీఏసీ పదవి కోసం గాంధీ దిక్కుమాలిన మాటలు మాట్లాడారని, ఆయనకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే.. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు.

Tags:    

Similar News