ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం... తెరపైకి సంచలన విషయాలు!

ఈ సమయంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు కార్యాలయానికి వెళ్లారు.

Update: 2025-01-06 08:22 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు... ఈ ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలను బయటపెట్టింది. ఇప్పుడు ఇది మరింత సంచలనంగా మారింది.

అవును... ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలను బయటపెట్టింది. ఇందులో భాగంగా... ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆరెస్స్ కు కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదే సమయంలో... గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నాయని.. ఇవన్నీ 2022 ఏప్రిల్ 8 - అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

కేటీఆర్ రియాక్షన్:

ఇలా.. ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆరెస్స్ పార్టీకి రూ.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా... గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అని.. ఫార్ములా ఈ-రేస్ జరిగింది 2023లోనని బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు.

ఇదే సమయంలో... గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా... పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధం అని తెలిపారు.

మరోపక్క.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారు కేటీఆర్. అయితే.. ఆ సమయంలో తనతో పాటు వచ్చిన తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో... తన న్యాయవాదికి అనుమతి నిరాకరణ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్... ఇవాళ తనను ఏసీబీ ఆఫీసుకు రమ్మన్నారని.. ఈ సందర్భంగా తాను మర్యాదగా విచారణకు సహకరిస్తుంటే.. తన న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు కాకుండా పోలీసులు చెబుతున్నారని.. ఇప్పటికే హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలు గంటలు వాదన్లు వినిపించారని.. ఇవాళ కొత్తగా శోధించి, సాధించేదేమీ లేదని తెలిపారు.

ఇక తనను అడుగుతున్న సమాచారం అంతా ప్రభుత్వం వద్దే ఉందని.. గతంలో ఓ మంత్రిగా ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తన వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారని.. తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఈ రోజు ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కు అని అన్నారు.

ఇదే సమయంలో... రైతు భరోసా ఎగ్గొట్టారని.. దాని నుంచి దారి మళ్లించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని.. ఇలాంటి నాటకాలకు భయపడమని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా... రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకూ కొట్లాడతామని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు.

Tags:    

Similar News