కేటీఆర్‌కు జ్వరం.. తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Update: 2024-09-28 06:12 GMT

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల వరదల కారణంగా హైడ్రా ప్రాముఖ్యత గురించి మరింత అందరికీ అర్థమైపోయింది. అక్రమ కట్టడాల వల్లే నాలాలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటితో ఇళ్లన్నీ మునిగిపోతున్నాయని అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో హైడ్రా చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో వరదలతో నగరానికి ఇబ్బందులు ఉండబోవని అనుకుంటున్నారు.

హైడ్రా కూల్చివేతలు కొందరికి సంతోషంగానే ఉన్నప్పటికీ.. కొందరు పేదల నుంచి మాత్రం వ్యతిరేకత వినిపిస్తోంది. ఎంతోకష్టపడి ఇల్లు కొనుక్కున్నామని, బ్యాంకులో అప్పు చేసి కొనగోలు చేశామని రోదిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలి తమ వెంట పడ్డారని శాపిస్తున్నారు. హైడ్రా ఒక్కసారిగా వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పర్మిషన్ల ఉన్నాయని తెలిసే తాము కొనుగోలు చేశామని, బ్యాంకు లోన్లు వచ్చాయని అంటున్నారు. అలాంటప్పుడు అవి అక్రమ నిర్మాణాలు ఎలా అవుతాయని నిలదీస్తున్నారు.

ఇదే క్రమంలో హైడ్రా బాధితులకు తాము అండగా నిలుస్తామని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితుల పక్షాన పోరాడుతామని చెప్పుకొచ్చారు. దాంతో ఈ రోజు బాధితులంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని అనుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్ఎస్ నేతలకు వివరిద్దామని వచ్చారు. కానీ.. తెలంగాణ భవన్‌కు వచ్చిన హైడ్రా బాధితులకు కేటీఆర్ అందుబాటులోకి రాలేదు.

దాంతో వెంటనే కేటీఆర్ తాను అందుబాటులోకి లేకపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా వివరించారు. తాను 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని ట్వీట్‌లో వెల్లడించారు. జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వాడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే కొలుకుంటానని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తప్పకుండా వస్తానని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యాలయానికి వస్తున్న హైడ్రా కూల్చివేతల బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. న్యాయబృందంతోపాటు ఎమ్మెల్యేలు, నేతలు మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు.

Tags:    

Similar News