ధన్యవాదాలు..: కేటీఆర్ కామెంట్
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసిన దరిమిలా అధికార పార్టీ బీఆర్ ఎస్ తన ఓటమిని అంగీకరించింది. నిన్న మొన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్‌ను సైతం తప్పుబట్టిన మంత్రి కేటీఆర్.. తామే అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్ సంస్థలు వాస్తవ ఫలితాల తర్వాత.. క్షమాపణలు చెబుతాయా? అని కూడా ప్రశ్నించారు. అయితే.. ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎక్కువ స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. బీఆర్ ఎస్ కంచుకోట్లనూ పార్టీ విజయం సాధించింది. దీంతో కేటీఆర్ తాజాగా దిగివచ్చారు.
‘‘బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈ రోజు (ఆదివారం) ఫలితం గురించి బాధలేదు. అయితే మేము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించింది. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభం జరగాలని ఆశిస్తున్నాను’’ అని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
మరోవైపు.. బీఆర్ ఎస్ నాయకులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ సహా తెలంగాణ భవన్‌లో ఎక్కడా సందడి కనిపించలేదు. పార్టీ గెలిస్తే.. సంబరాలు చేసుకుందామని భావించి ఇతర జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా తిరుగు ముఖం పట్టారు. మరోవైపు ప్రముఖ నాయకులు చాలా మంది ఓటమి చెందారు. ఐదుగురు మంత్రులు ఓడిపోయారు. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెరమీదికి వచ్చిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమి పాలయ్యారు. వీరిలో పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు ఉన్నారు.