మహాలక్ష్మి పథకంపై కేటీఆర్ మొదట్నించి ఎందుకంత నెగిటివ్?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఈ పథకానికి మహిళల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది.
సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపే విషయంలో తమకు మించిన మొనగాళ్లు మరెవరూ లేరన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంది గులాబీ పార్టీ. దేశంలోని పలు రాష్ట్రాలు అమలు చేసే ఎన్నో కార్యక్రమాలు తాము మొదలు పెట్టినవన్న గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది. అలాంటప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కారు ఏర్పాటైన తర్వాత అమలు చేసిన కొత్త పథకాల్లో మహాలక్ష్మి ఒకటి.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఈ పథకానికి మహిళల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని రేవంత్ సర్కారు పవర్ పగ్గాలు అందుకున్న వెంటనే అమలు చేయటం తెలిసిందే. ఈ పథకానికి ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో సానుకూలత వ్యక్తమైతే.. అందుకు భిన్నంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ పథకంపై నిప్పులు చెరగటం తెలిసిందే.
మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బ పడినట్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఆదరణ లభించలేదు. ఈ రోజుకు ఆటో డ్రైవర్ల మీద సామాన్య ప్రజల ఫిర్యాదులను కేటీఆర్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బ పడిందన్న మాటను పదే పదే చెప్పటం.. అందుకు భిన్నమైన వాతావరణం క్షేత్ర స్థాయిలో ఉండటం తెలిసిందే.
ఈ విషయాన్ని గుర్తించని కేటీఆర్.. ఇప్పటికి మహాలక్ష్మి పథకం గురించి విమర్శలు చేసేందుకు మిగిలిన వారి కంటే దూకుడుగా వ్యవహరించటం కనిపిస్తుంది. రేవంత్ సర్కారు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేసే కేటీఆర్.. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్ని వందల బస్సులు కొత్తవి తీసుకొచ్చారు? ఎన్ని పాత బస్సుల్ని తొలగించారు? అన్న లెక్కను చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. కేసీఆర్ సర్కారు కానీ బస్సుల సంఖ్యను డిమాండ్ కు అనుగుణంగా పెంచి ఉంటే.. ఈ రోజున పరిస్థితి మరోలా ఉండేది.
కానీ.. ఇవేమీ పట్టని కేటీఆర్.. మహాలక్ష్మి పథకంపై తనకున్న అక్కసును వెల్లడించే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టరన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించి తన తీరు మార్చుకుంటే మంచిది. లేకుంటే.. మహిళల అభిమానాన్ని పోగొట్టుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి.