కారు షెడ్డుకు వెళ్లింది సర్వీసింగ్ కే.. కేటీఆర్ నోట ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే.. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టింది ప్రజలే.
గెలుపు ధీమాకు టానిక్ గా మారితే.. ఓటమి లోపాల్ని బట్టబయలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ లోపాల గురించి కానీ పార్టీ సంస్థాగత సమస్యల గురించి కానీ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకున్నది లేదు. తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో కరెంటు షాకిచ్చారు ఓటర్లు. దీంతో.. దెబ్బకు అధికార పక్షం నుంచి ఇబ్బందికర ప్రతిపక్ష హోదాలోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన ఆర్నెల్ల వరకు ప్రతిపక్షం పెద్దగా మాట్లాడకుండా కామ్ గా ఉంటుంది. అదే పనిగా విమర్శలు చేయటానికి సాహసించదు. కానీ.. అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన రెండు రోజుల నుంచే విమర్శలు చేయటంతో పాటు.. మహా అయితే మూడు నెలలు మాత్రమే ఉండే ప్రభుత్వంగా గులాబీ కీలక నేతల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
అధికార పక్షానికి హనీమూన్ టైం కూడా ఇవ్వని రీతిలో చెలరేగిపోతున్న విపక్ష బీఆర్ఎస్.. తాజాగా జిల్లాల వారీగా పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరో రెండు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అందుకు తగ్గట్లుగా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలు..కార్యకర్తలతో తరచూ నిర్వహిస్తున్న సమావేశాల సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. భువనగిరి లోక్ సభ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. అంతేకాదు.. మారిన తన గళానికి తగ్గట్లే.. పార్టీ నేతలకు కొత్త లైన్ నిర్దేశించిన ఆయన.. ఇకపై ఎన్నికల్లో ఓటమిని ఎలా చూడాలన్న దానిపై కొత్త వాదనను వినిపించే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది. గడిచిన నెల రోజులుగా ఎన్నికల్లో ఓటమికి ఓటర్లు కారణమన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలకు భిన్నంగా.. ఇకపై ఓటమికి సంబంధించి ప్రజలపై ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలు చేయొద్దంటున్న కేటీఆర్.. "మనల్ని ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేశారని.. పార్టీ నాయకులు కొందరు అంటున్నట్లుగా నాకు చెబుతున్నారు.. ఇకపై ఎవరూ అలా మాట్లాడొద్దు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే.. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టింది ప్రజలే. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నా.. ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఎందుకిలా జరిగిందో విశ్లేషించుకొని ముందుకు వెళదాం" అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పదేళ్ల పాటు విరామం ఎరుగకుండా పని చేసిన కారు.. మరింత వేగంగా పని చేసేందుకే సర్వీసింగ్ కు పోయిందే తప్పించి షెడ్డుకు పోలేదు.
- కచ్ఛితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో అందుకు భిన్నంగా ఫలితాయి వచ్చాయి. ఇది నిరాశకు గురి చేసింది. 119 స్థానాల్లో 39 సీట్లలో తెలిచాం. 14 స్థానాల్లో కేవలం వందలు.. వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. అవి కూడా గెలిచి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేది.
- పాలన మీద ఫోకస్ చేసి.. పార్టీని పట్టించుకోలేదు. అందుకు పూర్తి బాధ్యత నాదే. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగా జరగలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. దీనికి పూర్తి బాధ్యత నాదే.
- నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపటం సరికాదు. ఇక.. ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టే ఎమ్మెల్యే తిరిగే పద్దతి ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించం. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు.
- ప్రభుత్వానికి.. పథకాలకు మధ్య కార్యకర్త లేకుండా నేరుగా లబ్ధిదారుడికే చేరటం వల్ల వారి మధ్య లింకు తెగింది. 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయాం.
- దళిత బంధు కొందరికే రావటంతో మిగిలిన వారు అసహనానికి గురయ్యారు. ఇతర కులాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. రైతుబంధు తీసుకున్న సామాన్య రైతులు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే ఒప్పుకోలేదు. పథకాలతో భవిష్యత్తులో పరజల్లో తలెత్తబోయే వ్యతిరేక ప్రభావాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం.