నాడు తిట్టి.. నేడు పొగిడి.. టీడీపీపై బీఆర్ ఎస్ వ్యూహం ఏంటి?

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బొగ్గుగ‌నుల వేలం ప్రారంభించారు.

Update: 2024-06-21 13:30 GMT

టీడీపీ విష‌యంలో తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అనుస‌రిస్తున్న వైఖ‌రి విస్మ‌యానికి గురి చేస్తోంది. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు.. టీడీపీని బూచి గా చూపించారు ఆ పార్టీ కీల‌క నాయ‌కులు. కానీ.. ఇప్పుడు అదే నోటితో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబుపైనా.. పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు. పోనీ.. ఇలా చేస్తున్న‌వారేమైనా చిన్న నాయ‌కులు అనుకుంటే పొర‌పాటే.. బీఆర్ఎస్ అగ్ర‌నాయ‌కులు. కేటీఆర్‌, హ‌రీష్ రావులే.. టీడీపీపై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బొగ్గుగ‌నుల వేలం ప్రారంభించారు. దీనికి సంబంధించి రాజ‌కీయం ముసురుకుంది. సింగ‌రేణి ని కూడా.. వేలంలో పాల్గొనాల‌ని ఆయ‌న సూచించారు. అయితే.. దీనిని బీఆర్ఎస్‌ నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఆ మాత్రం సింగ‌రేణికి వేలం లేకుండా .. గ‌నులు కేటాయించ‌లేరా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీలో 16 సీట్లు ద‌క్కించుకున్న టీడీపీని , సీఎం చంద్ర‌బాబును చూసి.. రేవంత్ రెడ్డి నేర్చుకోవాల‌ని.. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అక్క‌డ విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంటును ప్రవేటీక‌ర‌ణ కాకుండా.. 16 మంది ఎంపీలును మాత్రమే ఉన్నా.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ప్ర‌వేటీక‌ర‌ణ కాకుండా ఆపార‌ని.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు 8 మంది, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా.. సింగ‌రేణిని కాపాడ‌లేక పోతున్నార‌ని.. కేటీఆర్ అన్నారు. ఇక‌, ఇదే విధంగా హ‌రీష్ రావు కూడా.. విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీని చూసీ నేర్చుకోవాల‌ని ఇద్ద‌రూ చెప్పారు. అయితే.. ఇప్పుడు ఇలా.. టీడీపీని పొగిడిన వారు.. గ‌తంలో ఇదే టీడీపీని విమ‌ర్శించారు.

టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ‌ను పాలించే అర్హ‌త లేద‌న్నారు. తెలంగాణ‌లో ఏపీ పార్టీల‌ మూలాలు ఉన్న నాయ‌కులు అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష అని చెప్పారు. కానీ.. ఇప్పుడు టంగ్ మార్చి.. అదే టీడీపీని కేంద్రంగా చేసుకుని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి వీరి వ్యాఖ్య‌ల‌కు రేవంత్ ఏమంటారో చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. గ‌తంలో కేటీఆర్‌, హ‌రీష్‌రావులు చేసిన వ్యాఖ్య‌ల‌కు.. ఇప్ప‌డు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News