1400 సీసీ కెమెరాలు.. 45 కి.మీ. జల్లెడేస్తే కామపిశాచులు దొరికారు
ఈ చిన్న ఆధారంతో డొంక లాగారు. హత్యాచారం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 45 కిలోమీటర్ల మేర సీసీ కెమేరాల్ని జల్లెడ వేశారు పోలీసులు.
కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట జంక్షన్ కు సమీపంలోని ఒక కాంప్లెక్స్ సెల్లార్ లో ఒక మహిళను అత్యంత కిరాతకంగా అత్యాచారం చంపేసిన వైనం తెలిసిందే. ఈ ఉదంతం సంచలనంగా మారింది. నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవటం.. మరణించిన మహిళకు సంబంధించిన వివరాలు సరిగా లేకపోవటంతో ఈ కేసు ముందుకు సాగలేదు.
ఈ వేళలో ఈ కేసు విచారణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుకట్ పల్లి పోలీసులు శ్రమించి.. కాంప్లెక్స్ దగ్గర్లోని సీసీ కెమేరాల్ని జల్లెడ వేయగా.. నిందితులు ఇద్దరు పరారయ్యే ఫుటేజ్ లభించింది. వాహనాల మీదుగా వెళ్లినట్లుగా గుర్తించారు.
ఈ చిన్న ఆధారంతో డొంక లాగారు. హత్యాచారం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 45 కిలోమీటర్ల మేర సీసీ కెమేరాల్ని జల్లెడ వేశారు పోలీసులు. నిందితులు ప్రయాణించిన వాహనం మార్గాల్ని ఆధారంగా చేసుకొన్న పోలీసులు సాంకేతికత సాయంతో కేసును చేధించారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన రీతిలో ప్రశ్నించగా తాము చేసిన దారుణం గురించి చెప్పుకొచ్చారు. నిందితులు ఇద్దరిలో ఒకరు మైనర్ కావటం గమనార్హం.
ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. భర్త మరణించటంతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చింది. మూసాపేట వై జంక్షన్ లోని ఒక షోరూంలో స్వీపర్ గా పని చేస్తూ.. చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఉపాధి పొందేది. బిహార్ కు చెందిన 24 ఏళ్ల నితీశ్ కుమార్.. ఒక మైనర్ బాలుడు సంగారెడ్డిలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో పని చేస్తున్నారు. రోజూ తాగే అలవాటు ఉన్న వీరు ఏప్రిల్ 20న తమ స్నేహితుడు ఒకడు బిహార్ కు వెళుతుండటంతో అతడ్ని కలిసేందుకు బైక్ మీద నగరానికి వచ్చారు.
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ వద్ద అతడ్ని కలిసి తిరిగి వెళ్లే క్రమంలో కుకట్ పల్లికి సమీపంలోని ఒక టీ స్టాల్ వద్ద ఆగారు. టీ తాగే క్రమంలో అక్కడ బాధితురాలిని చూసిన నిందితులు ఆమెను ఫాలో అయ్యారు. ఎవరూ లేని సమయంలో ఆమెను కాంప్లెక్స్ సెల్లార్ వద్దకు లాక్కెళ్లి ఆమెను ఇద్దరు అత్యాచారం చేశారు. ఆమె పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆమె తలను నేలకేసి కొట్టి చంపేశారు.
అనంతరం ఇరువురు పరారయ్యారు. ఈ కేసును చేధించటం కోసం నాలుగు టీంలుగా ఏర్పడి.. భారీ ఎత్తున సీసీ కెమేరాల్ని జల్లెడ వేశారు. నిందితులు ప్రయాణించిన వాహనం మీద నెంబర్ ప్లేట్ అస్పష్టంగా ఉండటంతో.. తమకు లభించిన అంకెల ఆధారంగా నెంబర్లను వడబోయగా మొత్తం 10 నెంబర్లు తేలాయి. వాటిని తనిఖీ చేయగా నిందితులు ఆచూకీ లభించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మైనర్ బాలుడ్ని జువైనల్ హోమ్ కు తరలించగా.. మరొకరిని రిమాండ్ కు తరలించారు.