కుక్కల విద్యాసాగర్ కు చిక్కులు.. కాదంబరి ఎవరో తెలీదంటూ కోర్టులో సాక్ష్యం

ఈ సందర్భంగా వారు తమ వాంగ్మూలాన్ని ఇస్తూ.. తమకు.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పెద్దగా సంబంధాలు లేవని పేర్కొన్నారు.

Update: 2024-10-08 04:12 GMT

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెను.. ఆమె తల్లిదండ్రుల్ని ఏపీ పోలీసులు అరెస్టు చేయటానికి ప్రధాన కారణం.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు చెందిన 5 ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలతో .. బోగస్ పత్రాలతో వేరే వారికి అమ్మారని.. అందులో భాగంగాఅడ్వాన్సుగా రూ.5 లక్షలు చెల్లించినట్లుగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయటం తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీని పట్టుకొని జెట్ స్పీడ్ తో ముంబయికి వెళ్లటం.. ఆమెను అరెస్టు చేయటం తెలిసిందే.

అయితే.. ఫిర్యాదు చేయటానికి ముందే ముంబయికి ఏపీ పోలీసులు విమాన టికెట్లను కొనుగోలు చేసిన వైనం ఇప్పటికే వెలుగు చూసింది. ముంబయికి చెందిన పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టటం.. ఆ కేసును విత్ డ్రా చేయించటం కోసం కాదంబరిపై మోసం కేసు నమోదు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వాదన నిజమేనన్న అభిప్రాయాన్ని కలిగించే పరిణామం తాజాగా చోటు చేసుకుంది.

కాదంబరి ఎవరో తమకు తెలీదని.. ఆమెతో తమకు ఎలాంటి పరిచయం లేదని.. ఆమె నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పటం అబద్ధమే అవుతుందని జెత్వానీ కేసులో కీలక సాక్ష్యులైన నాగేశ్వరరాజు.. భరత్ కుమార్ లు కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చారు. జెత్వానీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు విచారణలో భాగంగా సదరు నటితో పాటు మరో సాక్షి శ్రీనివాసరావుల స్టేట్ మెంట్లను కోర్టులోరికార్డు చేయించటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. జెత్వానీ నుంచి భూమిని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ వాంగ్మూలాన్ని ఇస్తూ.. తమకు.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పెద్దగా సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఆయన తండ్రి.. జెడ్పీమాజీ ఛైర్మన్ నాగేశ్వరరావుతో తమకు సాన్నిహిత్యం ఉండేదన్నారు. 2014లో వైసీపీ తరఫు విద్యాసాగర్ పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడారని అప్పుడే తాము ఆయన్ను చివరిసారిగా చూసినట్లు పేర్కొన్నారు.

"కాదంబరిపై నమోదైన కేసులో మమ్మల్ని సాక్ష్యులుగా చేర్చారు. జగ్గయ్యయపేటలోని 5 ఎకరాల భూమిని మాకు అమ్మలేదు. ఆమె ఎవరో మాకు తెలీదు. ఈ కేసులోకి మమ్మల్ని అనవసరంగా లాగారు. మా పరువుకు భంగం కలిగించారు. దీనిపై కూచిపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. తప్పుడు కేసు నమోదు చేసేందుకు విద్యాసారగ్ కట్టుకథలు అల్లారు" అంటూ తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ పరిణామం కుక్కల విద్యాసాగర్ కు మరిన్ని చిక్కుల్ని తీసుకురావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News