కన్నబాబు వచ్చేశారు....ఫ్యాన్ జోరు చేసేనా ?

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు విశాఖకు తొలిసారి వచ్చారు.

Update: 2025-02-21 03:53 GMT

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు విశాఖకు తొలిసారి వచ్చారు. ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కన్నబాబుతో విశాఖ వైసీపీ రాజకీయం మారుతుందని నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కన్నబాబు మంచి ముహూర్తం చూసుకుని పార్టీ బాధ్యతలను స్వీకరిస్తారని అంటున్నారు. కన్నబాబుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పరిచయాలు ఉన్నాయని అంటున్నారు.

ఆయన ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం విశాఖలోనే పాత్రికేయునిగా పనిచేశారు. ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. అదే విధంగా చూస్తే కనుక ఆయనకు విశాఖలోని అన్ని పార్టీల నాయకులతోనూ మంచి సంబంధాలే ఉన్నయని చెబుతారు.

ఇక వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నపుడు కన్నబాబు విశాఖ జిల్లా ఇంచార్జిగా పనిచేశారు. అదే విధంగా ఆయనకు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు అందరితో మంచి అనుబంధం ఉంది. ఆయన పార్టీని మూడు జిల్లాలలో కో ఆర్డినేట్ చేసుకోగలుగుతారు అని అంటున్నారు.

ఇక చూస్తే వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. వారంతా ఇపుడు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. కొందరు నేతలు అయితే సైలెంట్ గా ఉన్నారు. పార్టీ చూస్తే ఉత్తరాంధ్రాలో ఎన్నడూ లేని విధంగా వీక్ గా ఉంది. దాంతో పాటుగా టీడీపీ కూటమికి కంచుకోటగా ఈ ప్రాంతం ఉంది.

మూడు ఉమ్మడి జిల్లాల్లో కూటమికి చెందిన వారే అత్యధిక శాతం గెలిచారు. కేవలం రెండే రెండు సీట్లు అది కూడా విశాఖ మన్యంలో వైసీపీకి దక్కాయి. దాంతో వైసీపీని పటిష్టం చేయడం అన్నది కత్తిమీద సాముగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కన్నబాబుకు కీలక బాధ్యతలు దక్కాయి.

మరి ఆయన ఏ విధంగా ఫ్యాన్ పార్టీని ఉత్తరాంధ్రాలో గట్టిగా గాలి వీచేలా చేయగలరు అన్నది చర్చగా ఉంది. ఇంకో వైపు చూస్తే వైసీపీలో అంతటా నైరాశ్యం ఉంది. పార్టీకి నియోజకవర్గాల ఇంచార్జిలను నియమించినా ఎవరూ కూడా క్రియాశీలం కాలేకపోతున్నారు. దాంతో వారిని కూడా గేరప్ చేయాల్సిన బాధ్యత కన్నబాబు మీద ఉంది అని అంటున్నారు.

ఇకపోతే కన్నబాబుకు ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉండడం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, సౌమ్యుడిగా ఉండడం అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉన్న వారు కావడం వల్ల ఆయన వైసీపీని పట్టాలు ఎక్కించగలరని భావిస్తునారు. మొత్తం మీద చూస్తే కనుక కన్నబాబు బాధ్యతలు స్వీకరించాక వైసీపీ రాజకీయం ఏ విధంగా మారుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News