కర్నూల్ లో హైకోర్టు బెంచ్ కి కసరత్తు!
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో తాము ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వెళ్తున్నారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో తాము ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వెళ్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమకు కీలకమైన హామీగా ఉన్న హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో కూడా మాట నిలబెట్టుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో ప్రజాగళం పేరుతో కర్నూల్ లో నిర్వహించిన సభలో అక్కడ హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బాబు సీఎం అయిన తరువాత ఆ విషయంలో సీరియస్ గానే అడుగులు వేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీసు నుంచి ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు లేఖ కూడా వచ్చింది. దానిని కేంద్ర న్యాయ శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. ఇక కేంద్ర న్యాయ శాఖలో కూడా కదలిక మొదలైంది. ఆ దిశగా కసరత్తును స్టార్ట్ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేసే విషయం మీద హైకోర్టు రిజిస్ట్రార్ కి కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సునీత లేఖ తాజాగా రాయడంతో కర్నూలు వాసులలో ఆశలు పెరుగుతున్నాయి.
ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తురు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలను ఇవ్వాలని సునీత హైకోర్టు రిజిస్ట్రార్ ని ఆ లేఖలో కోరారు. అంటే అమరావతిలోని హైకోర్టుకు ఈ నాలుగు జిల్లాల నుంచి వచ్చే కేసులు ఎన్ని అన్న దాని మీద కేంద్ర న్యాయ శాఖ పరిశీలిస్తోంది అని అంటున్నారు.
అంతే కాదు గత రెండు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కూడా ఇవ్వాలని సునీత కోరారు. ఇక హైకోర్టు ప్రత్యేక బెంచ్ ని ఒక చోట ఏర్పాటు చేయాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మొత్తం హైకోర్టుకు వచ్చే కేసులలో ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని కూడా చెబుతున్నారు.
ఇక ఏపీ మొత్తం జనాభా 4.95 కోట్లుగ ఉంది. ఇందులో రాయలసీమ ప్రాంతంలో 1.59 కోట్ల మంది ఉన్నారని తెలుస్తోంది. అంటే మొత్తం ఎపీ జనాభాలో 25 శాతం మంది రాయలసీమలో ఉన్నారన్న మాట. ఈ లెక్కన చూస్తే రాయలసీమలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు రాయలసీమ నుంచి అమరవతి రాజధానికి వచ్చెందుకు రవాణా సదుపాయాలు కూడా పెద్దగా లేవన్న దానిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
దీంతో కర్నూలులో హైకోర్టుకి నిబంధలను అన్నీ సరిపోతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేశారని కేంద్ర న్యాయ శాఖ అధికారులు తెలిపారు. అదే క్రమంలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తే అది ఎనిమిదవది అవుతుంది. మొత్తానికి చూస్తే హైకోర్టు బెంచ్ అన్నది కర్నూల్ తో పాటు రాయలసీమ ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన అంశంగా చూస్తున్నారు. సో తొందరలోనే వారి కల సాకారం అవుతుంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎప్పటికీ ఈ సీమ ప్రజలు మరచిపోరు అని అంటున్నారు.