లోకేశ్ కృషితో 'మేక జీవితానికి' విముక్తి!
ఉపాధి కోసం కువైట్ కు వెళ్లి.. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో మేకలు, కోళ్లు, గుర్రాలు, పశువులు మేపుతున్న శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది
ఉపాధి కోసం కువైట్ కు వెళ్లి.. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో మేకలు, కోళ్లు, గుర్రాలు, పశువులు మేపుతున్న శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఇక్కడ అంతా ఎడారని, ఎవరూ పలకరించేవారు లేరని, యజమానులు కూడా ఎప్పుడో ఓసారి వస్తారని.. తినడానికి తగినంత తిండి కూడా పెట్టడం లేదని.. ఇలాగయితే ఒకటి రెండు రోజుల్లోనే తాను మరణించేట్టు ఉన్నానని శివ అనే వ్యక్తి సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను ఆదుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కోరాడు.
ఈ నేపథ్యంలో శివ సెల్ఫీ వీడియోతోపాటు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తిలో ఉన్న అతడి భార్య, కుమార్తెలు చేసిన విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడారు. కువైట్ లో ఎడారిలో దుర్భర జీవితం గడుపుతున్న శివను రక్షించాలని కోరారు. అలాగే కువైట్ లో ఉన్న టీడీపీ ఎన్నారై విభాగాన్ని కూడా లోకేశ్ అప్రమత్తం చేశారు.
దీంతో లోకేశ్ విజ్ఞప్తితో భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఎడారి జీవితం గడుపుతున్న శివకు విముక్తి కల్పించింది. అతడిని అక్కడి నుంచి సురక్షితంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయానికి తీసుకొచ్చింది. అక్కడ అతడికి భారత్ కు తిరిగి వెళ్లే వరకు ఉండటానికి రూమ్, వసతి, భోజన సదుపాయాలు కల్పించింది.
టీడీపీ ఎన్నారై బృందం కూడా శివను కలిసింది. అతడిని భారత్ కు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ సందర్భంగా శివ సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు తనను రక్షించారని, తనకు ఉండటానికి రూమ్ ఇచ్చారని, ఆహారం కూడా పెట్టారని తెలిపారు. తనను రక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. కూలి పనులతో వచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో అప్పు చేసి మరీ శివ కువైట్ కు వెళ్లాడు.
వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల రోజుల క్రితం కువైట్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతyì కి అక్కడి ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిని అప్పగించారు. యజమానులు ఎప్పుడో కానీ అక్కడికి రాకపోవడం, తగిన ఆహారం, నీరు అందించకపోవడం, బాధలు చెప్పుకుందామనుకున్నా కనుచూప మేరలో జనం లేకపోవడం వంటి సమస్యలతో శివ పూర్తిగా భయపడిపోయాడు. అతడి మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింది.
అంతకంతకూ కష్టాలు పెరిగిపోతుండటంతో తన ఏజెంట్ హైదర్ కు ఫోన్ చేసి శివ తన బాధలన్నింటిని వివరించారు. అయితే ఏజెంట్ అక్కడ పనిచేయాల్సిందేనని.. మరో మార్గం లేదని చెప్పడంతో శివ ఆవేదనకు గురయ్యాడు. తన బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది.
ఇక్కడ కువైట్ లోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని శివ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కువైట్ కు రాకముందు చెప్పిన పని వేరని.. కువైట్ వచ్చాక చేయిస్తున్న పని వేరని వాపోయాడు. ఇక్కడ అంతా ఎడారేనని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్నాడు. కనీసం మాట్లాడటానికి మనిషన్నవాడు లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆరోగ్యం దెబ్బతిన్నా యజమానులు పట్టించుకోవడం లేదని.. తనను కాపాడాలని.. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణమ్యని ఆ సెల్ఫీ వీడియోలో శివ వాపోయాడు. ఇక్కడే ఉంటే మరో రెండు రోజులకు మించి తాను బతకనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏజెంట్ తనను మోసం చేయడంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని బాధితుడు శివ కన్నీటిపర్యంతమయ్యాడు. తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధితుడికి భరోసా ఇచ్చారు. శివను రక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అతడిని రక్షించారు.