తెలంగాణ తర్వాత.. దేశంలో 30వ రాష్ట్రం అదేనా?
దీంతోపాటే కశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
భారత్ లో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి అప్పుడే పదేళ్లు అవుతోంది. సరిగ్గా 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయింది. ఆపై 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటివరకు దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి. ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. దీనికిముందు 2000 సంవత్సరంలో యూపీ నుంచి ఉత్తరాఖండ్ ను, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ ను, బిహార్ నుంచి జార్ఖండ్ నుంచి వేరు చేసి రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. గమనార్హం ఏమంటే.. ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో, 2001లో కేసీఆర్ ఆధ్వర్యంలో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రమై ఆ తర్వాత 14 ఏళ్లకు తెలంగాణ సాకారమైంది.
ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలు కాకుండా.. ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగఢ్, డామన్-డయ్యూ, లక్షదీవులు. జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలు కాగా, మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు.
ఆర్టికిల్ 370 రద్దుతో..
2019 ఆగస్టు ముందు వరకు జమ్మూకశ్మీర్ ఒకే రాష్ట్రంగా ఉండేది. అయితే, ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 అధికరణాన్ని 2019లో మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటే కశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అప్పటినుంచి అదే హోదా కొనసాగుతోంది. అయితే, వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలోనే లద్దాఖ్ ను రాష్ట్రంగా ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే దేశంలో 30వ రాష్ట్రంగా లద్దాఖ్ ఏర్పడనుంది. అంతేకాక లద్దాఖ్ లో ప్రస్తుతం ఒక ఎంపీ సీటు మాత్రమే ఉంది. దానినీ పెంచే ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది.
29 నుంచి 28కి.. ఆపై 30కి..
కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకముందు దానిని కలుపుకొని 29 రాష్ట్రాలు ఉండేవి. కేంద్రపాలితం చేశాక సంఖ్య 28కి తగ్గింది. అయితే.. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తూ (లద్దాఖ్ లేకుండా), లద్దాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతోనే సంఖ్య 30కి చేరుతుంది. కాగా, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 రద్దును డిసెంబరు నెలలో సుప్రీం కోర్టు సైతం సమర్థించిన సంగతి తెలిసిందే. దీంతోనే కశ్మీర్, లద్దాఖ్ ల విషయంలో ఎటువంటి రెండో ఆలోచన లేకుండా పోయినట్లయింది.